Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదుకోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం
- ఏడేండ్లుగా ఏం చేసిందో మోడీ సర్కార్ చెప్పటం లేదు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ రైతు రామ్ రుచి (22) ఆత్మహత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. పంట నష్టం, అప్పుల బాధతో అతడు ఆత్మహత్య చేసుకోవటం అందర్నీ కలిచివేసింది. అలాగే అప్పులబాధతో ప్రమోద్ పటేల్ అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రైతులు ఇంత తీవ్రమైన నిర్ణయానికి ఎందుకు వస్తున్నారు? అన్నది యూపీలో చర్చనీయాంశమైంది. భారీ వర్షాలతో పంట పూర్తిగా నష్టపోవటం, అప్పుల బాధలు, మద్దత ధర లేకపోవటం రైతుల్ని వేధిస్తున్నాయని, నష్టాలపాలైన రైతును ఆదుకునే ప్రయత్నం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేయటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న భూమిని తాకట్టుపెట్టి, రాత్రిపగలు కష్టపడితే పంట చేతికి రావటం ఒక పెద్ద విషయం. ఒకవేళ వచ్చినా పంటను అమ్ముకుందామంటే కొనేవాడు లేడు. మార్కెట్లో మద్దతు ధర రావటం లేదు. చివరికి అప్పులు, అవమానాలు మిగులుతున్నాయి. తీవ్రమైన మనోవేదనను మిగుల్చుతున్నాయని, అందుకే రైతు ఆత్మహత్యలు పెరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రూ.10 వడ్డీ వసూలు చేశారు..
బాందా జిల్లాకు చెందిన యువ రైతు రామ్ రుచి పొలం సాగు కోసం రుణాలు చేశాడు. వెంటనే కావాలంటే రూ.10 వడ్డీ ఇవ్వాలంటూ షరతు పెట్టడంతో..ఒప్పుకోక తప్పలేదు. ఇదే అతడి మెడకు చుట్టుకుంది. కుటుంబంలో గొడవలకు దారితీసింది. ఒకసారి ఇంటికి వచ్చి వడ్డీ కట్టాలని గొడవచేయటంతో రామ్రుచి, అతడి తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్వేగానికి లోనైన రామ్ రుచి గదిలోకి వెళ్లి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పంటమీద పెట్టిన పెట్టుబడి, అప్పులు భారీమొత్తం కావటంతో రామ్ రుచి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకొని రైతులు పెద్ద మొత్తంలో ఖర్చుచేసి పంటసాగు చేస్తున్నారని, ప్రకృతి విపత్తులు, బయట పరిస్థితులు తమను దెబ్బతీస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలతో లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇందులో అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.
ఎన్నికల వేళ మళ్లీ కొత్తపాట!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దృష్టి అంతా ఈ రాష్ట్రం మీదే ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి అత్యధిక ఎంపీలు సీట్లు గెలవాలంటే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. దాంతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని ప్రధాని యూపీలో ప్రారంభిస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నారు. ఏడేండ్ల క్రితం 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశ రైతాంగానికి చెప్పిన..రైతుల ఆదాయం రెట్టింపు, సంక్షేమం అనేది పక్కకు పోయింది. ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం ఏడేండ్లుగా ఏం చేశామో..చెప్పటం లేదు. 'అభివృద్ధి డబుల్ ఇంజన్'తో పరుగులు పెడుతోందన్న..మాటను తెరమీదకు తీసుకొస్తున్నారు.