Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు చట్టాలపై ప్రస్తుతానికి ఒక అడుగు వెనక్కివేశాం
- అవసరమనుకుంటే మళ్లీ తెస్తాం..
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం చేసిన సుదీర్ఘపోరాటాన్ని మోడీ సర్కార్ అపహాస్యం చేయబోతోందా? ఐదు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే వాటిని రద్దు చేసిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. రద్దు చేసిన సాగు చట్టాల్ని మరో రూపంలో అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన కేంద్రం చేయబో తోందా? అనే ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అవుననే సమాధానం ఇచ్చారు! మహారాష్ట్రలో శనివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తోమర్..మూడు సాగు చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఆగ్రో విజన్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..''స్వాతంత్య్రం వచ్చిన 70ఏండ్ల తర్వాత ప్రధాని మోడీ నాయకత్వంలో అతిపెద్ద సంస్కరణ తీసుకొచ్చాం. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చాం. కానీ విపక్షాలకు ఈ సంస్కరణలు నచ్చలేదు. అందుకే వీటిని నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. జరిగిందానికి కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి చెందటం లేదు. మేం ఒక అడుగు వెనక్కి వేశాం..అంతే! కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం'' అని అన్నారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఆయన సూచనప్రాయంగా వెల్లడించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివాదాస్పద సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు దాదాపు ఏడాదికిపైగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంపాటు సాగిన రైతు నిరసనలతో కేంద్రం దిగిరాక తప్పలేదు. సాగు చట్టాల్ని రద్దు చేస్తున్నామని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. అటు తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆ చట్టాల రద్దుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టగా.. ఉభయసభలు ఆమోదించాయి. ఎలాంటి చర్చకు తావివ్వకుండా బిల్లుల్ని ప్రవేశపెట్టి సాగు చట్టాలు తీసుకురాగా, చట్టాల రద్దు విషయంలోనూ కేంద్రం అదే పద్ధతిని కొనసాగించింది. రైతాంగ సంక్షోభం, ఆత్మహత్యలు, మద్దతు ధరపై చర్చకు తావివ్వకుండా సభను నిర్వహించిన తీరు వివాదాస్పదమైంది.