Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట్-2021 పరీక్షలో ఫిజిక్స్ ప్రశ్న హిందీలోకి తప్పుగా అనువాదం
- ప్రధాని మోడీకి ప్రముఖ రిటైర్డ్ లెక్చరర్ బంతియా లేఖ
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2021లో హిందీలోకి తప్పుగా అనువదించబడిన ఫిజిక్స్ ప్రశ్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని పేర్కొంటూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు వ్యతిరేకంగా రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధాని మోడీకి రాసిన ఈ లేఖలో రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ అజిత్ సింగ్ బంథియా ప్రస్తావించిన పలు విషయాలు ఇలా ఉన్నాయి. 'ఆల్టర్నేటింగ్ కరెంట్' పై ప్రశ్నను తప్పుగా రూపొందించడం ద్వారా హిందీ మీడియం అభ్యర్థులకు ఎన్టీఏ అన్యాయం చేసిందని బంతియా ఆరోపించారు. ప్రశ్న ఆంగ్ల వెర్షన్లో 'యాంప్లిట్యూట్ ఆఫ్ కరెంట్' అని పేర్కొనగా, హిందీ వెర్షన్లో దానిని 'ధార' (కరెంట్) అని మాత్రమే పేర్కొంది. అలాగే, 'యాంప్లిట్యూడ్' అనే పదాన్ని తొలగించింది. ఇది స్టాండర్డ్ వాల్యూని 'రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ కరెంట్'గా పరిగణించడం ద్వారా దీనిని పరిష్కరించే విధంగా విద్యార్థులను ప్రేరేపించిందని బాంథియా చెప్పారు. ఇదిలావుండగా, కోటాలోని హిందీ భాషాభిలాషులు ఈ ప్రశ్న ప్రమాణీకతను ధ్రువీకరించాలని డిమాండ్ చేస్తూ హిందీ మాధ్యమ పరీక్షార్థి సంఘర్ష్ మోర్చాను ఏర్పాటు చేశారు. ఎన్టీఏ తప్పిదం కారణంగా పరీక్ష రాసిన వారు ఐదు మార్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందనీ, కటాఫ్ తో కూడిన ఈ పోటీ పరీక్షలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. తప్పుగా అనువదించబడిన ఈ ప్రశ్న కారణంగా దాదాపు 2 లక్షల మందిపై ప్రభావం పడుతుందనీ, వారు ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లను కోల్పోయే ప్రమాదమేర్పడిందని తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ విషయంపై విద్యార్థులు ఎన్టీఏకు ఫిర్యాదు చేశారు. కీని సవరించాలని కోరారు కానీ ఎజెన్సీ దానికి అంగీకరించలేదు. దీంతో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో బంతియా ప్రధాని మోడీకి లేఖ రాశారు.