Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ గుట్టు విప్పేందుకు శాస్త్రవేత్తల కృషి
- వ్యాక్సినేషన్ లో భారత్ అద్భుత పురోగతి
- ఇది సైన్స్, శాస్త్రవేత్తలపైన నమ్మకానికి నిదర్శనం
- తెలంగాణ వాసి కూరెళ్ల విఠలాచార్య ప్రస్తావన : మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ విషయంలో మనం అద్భుతమైన పురోగతి సాధించిందని ప్రధాని మోడీ అన్నారు. 140 కోట్ల డోసుల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి విజయంగా ఆయన అభివర్ణించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గుట్టు విప్పేందుకు శాస్త్రవేత్తలు నిరంతం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ అవగాహనతో క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. ఆదివారం మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ మాట్లాడారు. కొత్త సంవత్సరంలో పుస్తక పఠనాన్ని మరింత ఆసక్తిగా మారుద్దామని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ఏడాది చదవాలనుకుంటున్న పుస్తకాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సరంలో చదవాల్సిన పుస్తకాల జాబితా సిద్ధమవుతుందన్నారు.తమిళనాడులో ఇటీవల వాయుసేన హెలికాప్టర్ కూలి గాయాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ను గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆగస్టులో శౌర్యచక్ర పురస్కారం అందుకున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్, చిన్ననాటి స్కూల్ ప్రిన్సిపల్‌కు రాసిన లేఖ చదివిన తరువాత తన.హృదయం బరువెక్కిందని అన్నారు. ఆ స్థాయికి చేరుకున్న తరువాత కూడా ఆయన మూలాల్ని మరిచిపోలేదని కొనియాడారు. పైగా ఉత్సాహంగా వేడుక చేసుకోవాల్సిన సమయంలో ముందు తరాల గురించి చింతించారని తెలిపారు.''మార్కులు బాగా రానంతమాత్రాన మీరు ఎప్పుడూ సగటు మనిషిలా ఉండిపోతారేమోనని నిరుత్సాహపడకండి. పాఠశాలలో మీరు సగటు విద్యార్థి కావొచ్చు. భవిష్యత్తులో జరగబోయేదానికి మాత్రం అది కొలమానం కాదు. మీకు ఏది ఇష్టమో గుర్తించండి. ఏ రంగంలోకి దిగినా అంకితభావంతో పనిచేయండి. నేను సగటు విద్యార్థిని. 12వ తరగతిలో అతికష్టం మీద ఫస్ట్ డివిజన్ సాధించాను. క్రీడల్లోనూ అంతంత మాత్రమే. కానీ నాకు విమానాలన్నా.. విమానయాన రంగమన్నా అమితాసక్తి. అందులో చూపిన తెగువ కారణంగా రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర అవార్డు దక్కింది'' అని గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లేఖ రాసినట్టు మోడీ గుర్తు చేశారు.''మన దేశం వందేండ్లలో వచ్చిన అతిపెద్ద అంటువ్యాధితో పోరాడగలగడం అందరి కృషి ఫలితం. ప్రతి కష్ట సమయంలో ఒక కుటుంబంలా ఒకరికొకరం అండగా నిలిచాం. మీ ప్రాంతంలో, నగరంలో ఎవరికైనా సహాయం చేయడానికి సాధ్యమయ్యేదానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఈ రోజు ప్రపంచంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను మన దేశంతో పోల్చి చూస్తే దేశం అపూర్వమైన తరహాలో పని చేసినట్టు అనిపిస్తుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించిందా అనిపిస్తుందన్నారు.కరోనా ఈ వైవిధ్యానికి వ్యతిరేకంగా అప్రమత్తత, స్వీయ క్రమశిక్షణ దేశానికి గొప్ప శక్తి. మన సంఘటిత శక్తి కరోనాను ఓడిస్తుంది. ఈ బాధ్యతతో మనం 2022లోకి ప్రవేశించాలి'' అని సూచించారు.
''ఈ సంవత్సరం కూడా పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చించాలని ప్రణాళిక రూపొందిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ కూడా రెండు రోజుల తర్వాత డిసెంబర్ 28 నుండి మై గవ్ డాట్ ఇన్ లో ప్రారంభం అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 28 నుంచి జనవరి 20 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆన్లైన్ పోటీలను కూడా నిర్వహిస్తాం. మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కలిసే అవకాశం లభిస్తుంది. మనం కలిసి పరీక్ష, కెరీర్, విజయం, విద్యార్థి జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చిద్దాం'' అని అన్నారు.
తెలంగాణ వాసి కూరెళ్ల విఠలాచార్య ప్రస్తావన
మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ తెలంగాణ వాసి కూరెళ్ల విఠలాచార్యను ప్రస్తావించారు. ''మన దేశం చాలా అసాధారణమైన ప్రతిభలతో సుసంపన్నమైంది. ఆ ప్రతిభా మూర్తుల .సృజనాత్మకత ఇతరులను ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య (84) ఒకరు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనేందుకు విఠలాచార్య ఒక ఉదాహరణ. పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్య చిన్నప్పటి నుంచి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమేణా విఠలాచార్య అధ్యాపకుడయ్యారు. తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేశారు. అందులో అనేక సృజనాత్మక రచనలు చేశారు. 6-7 సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడం మొదలుపెట్టారు. తన సొంత పుస్తకాలతో లైబ్రరీని ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు అందులో చేరడం, సహకరించడం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. చదువుతో మొదలుకొని అనేక విషయాల్లో తాను పడిన ఇబ్బందులు మరెవరికీ రాకూడదని విఠలాచార్య అంటారు. ఈరోజు అధిక సంఖ్యలో విద్యార్థులు దాని ప్రయోజనాలను పొందడం చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కృషితో స్ఫూర్తి పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో నిమగమై ఉన్నారు'' అని ప్రధాని మోడీ అన్నారు.