Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలనా యంత్రాంగంలో పెరుగుతున్న ధిక్కార ధోరణి
- చట్టాల అమలుకు సహకరించాలి : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
విజయవాడ : న్యాయవ్యవస్థ పట్ల పాలనాయంత్రాంగంలో ధిక్కార ధోరణి పెరుగుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్దార్ధ కళాశాలలో 'భారత న్యాయవ్యవస్థ-సవాళ్లు'అనే అంశంపై ఆదివారం ఆయన జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాల సక్రమ అమలుకు పాలనాయంత్రాంగం సహకారం ఎంతో కీలకమని చెప్పారు.
అయితే, కొంత కాలంగా ఈ పరిస్థితి మారుతోందనీ, కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయని ధోరణి పెరుగుతోందని చెప్పారు. 'నిర్లక్ష్యంగా.. అగౌరవంగా కూడా కొందరు వ్యవహరిస్తున్నారు' అని అన్నారు. న్యాయవ్యవస్థ ఎదర్కుంటున్న సమస్యలను పరిష్కరించే బాధ్యత శాసనవ్యవస్థతో పాటు పాలనాయంత్రాంగంపై కూడా ఉన్నదని చెప్పారు. న్యాయాధికారుల ఖాళీలను భర్తీ చేయకుండా, ప్రాసిక్యూటర్లను నియమించకుండా, మౌలికవసతులను మెరుగుపరచకుండా, ముందుచూపుతో చట్టాలను రూపొందించకుండా కేవలం న్యాయవ్యవస్థను మాత్రమే తప్పు పట్టడం సబబుకాదని అన్నారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమిస్తారనడం నిజం కాదని, నియమాకాలకు సుదీర్ఘప్రక్రియ ఉందని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థకు మరింత స్వేఛ్చ ఇవ్వాల్సిఉందని అన్నారు. ప్రభుత్వం తరపున వాదించే క్రమంలో కొందరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అసలు ఆలోచించడం లేదని, కేవలం బెయిల్ దరఖాస్తులను వ్యతిరేకించడం కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పీపీల నియమాకం కోసం స్వతంత్ర సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏపీ హైకోర్టు వద్ద ఘనస్వాగతం
ఏపీ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, రాష్ట్ర బార్ కౌన్సిల్ హైకోర్టులో సంయుక్తగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సతీసమేతంగా హాజరయ్యారు. రాజధానికి చెందిన గ్రామాల ప్రజలు మానవహారంగా ఏర్పడి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో ఎన్.వి రమణ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, హక్కుల పరిరక్షణలో న్యాయవాదులు మరింత కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులు సహా వివిధ ఖాళీల భర్తీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరాలు పంపితే, వాటి భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటానని అన్నారు. బబెజవడ బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సిఎ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మాతృభాషలో న్యాయవ్యవస్థ కార్యకలాపాలు జరగాలని అన్నారు. కోవిడ్ సమయంలో న్యాయవాదులు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో న్యాయాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ పిఎస్.నర్సింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.