Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : దేశంలో ఉన్న అన్ని మదర్ ధెరిస్సా మిషనరీస్ ఆఫ్ ఛారీటీ బ్యాంక్ ఖాతాలను స్థంభింపచేయడం సంచలనంగా మారింది. ఖాతాలను స్థంభింపచేయడం దిగ్భ్రాంతి కలిగించిందని కొల్కతా ఆర్చ్ డియోసెస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కొల్కతా ఆర్చ్ డియోసెస్, వికార్ జనరల్, ఫాదర్ డొమినిక్ గోమ్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సమాజం బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసి ప్రభుత్వ సంస్థలు పేదలలోని పేదలకు క్రూరమైన క్రిస్మస్ బహుమతిని ఇచ్చాయి' అని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల్లో 22,000 మంది ప్రత్యక్షంగా ఆధారపడినవారు, లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. కుష్టువ్యాధి-బాధితులైన, సామాజిక బహిష్కరణకు గురైన వేలాది మందికి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ, సిస్టర్స్ మరియు బ్రదర్స్ సహాయం చేస్తున్నాయని చెప్పారు. 'ఛారిటీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యను మేము ఖండిస్తున్నాము. ఈ నిర్ణయం వల్ల కలిగే మానవతా విపత్తును పరిగణనలోకి తీసుకునే సమయం లేకపోవడంతో మేము మరింత భయపడుతున్నాం' అని తెలిపారు. ఇది మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రతినిధులపై దాడి కాదని, భారతదేశంలోని పేదల్లో పేదలకు, సమాజానికి సేవ చేస్తున్న వారిపై భయంకరమైన దాడిగా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి.కాగా, ఈ ఖాతాల స్థంభనపై మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఇంకా స్పందించలేదు.అయితే మరోవైపు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం స్పందించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన ఏ బ్యాంక్ ఖాతాను స్థంభింపచేయలేదని తెలిపింది. అయితే ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ దరఖాస్తును తిరస్కరించినట్లు తెలిపింది. అర్హత ప్రమాణాలను అందుకోనందున, కొన్ని ప్రతికూల ఇన్పుట్ల కారణంగానూ ఈ దరఖాస్తులను ఈ నెల 25న తిరస్కరించామని ఒక ప్రకటనలో పేర్కొంది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క ఏ ఖాతాను స్తంభింపజేయలేదని, అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఖాతాలను స్తంభింపజేయమని తమ బ్యాంకులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం ఇచ్చిందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.