Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలు, మధ్య తరగతి వారికి ఉన్నత విద్య అవశాలపై ప్రభావం
- ఎన్ఈపీ వ్యతిరేక 50 రోజుల ప్రచారంలో అనేక మంది విద్యార్థులు ఉపాధ్యాయులు, మేధావులు, నిపుణులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) వివాదాస్పదమవుతున్నది. దేశ రాజధానిలోని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో జాతీయ విద్యా విధానానికి (ఎన్ఇపి) వ్యతిరేకంగా దేశవ్యాప్త 50 రోజుల ప్రచార కార్యక్రమంలో 150 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నిపుణులు, విశ్లేషకులు హాజరయ్యారు. ప్రతిపాదిత ఎన్ఈపీ వల్ల అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు తొలగించడం, ఫీజుల పెంపుదల, ఉన్నత విద్యలో కాంట్రాక్టు, ప్రయివేటీకరణ మరింతగా పెరగడం వంటి కారణాలను ఈ సదస్సు నొక్కిచెప్పింది. నూతన జాతీయ విద్యా విధానం సరసమైన, అధిక నాణ్యత గల ప్రభుత్వ విద్య ప్రాథమిక హక్కును ఉల్లంఘించేలా చేస్తుందనీ, ఇది ఉన్నత విద్య నుంచి దిగువ, మధ్యతరగతి వర్గాలను మినహాయించడానికి దారి తీస్తుందని వక్తలు పేర్కొన్నారు. రచయిత, చరిత్రకారుడు సయ్యద్ ఇర్ఫాన్ హబీబ్ విద్య 'కాషాయీకరణ' అంశాన్ని నొక్కిచెప్పారు, అయితే, వివాదాస్పద మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాడినికి కారణమైన రైతు ఉద్యమం మాదిరిగా ఎన్ఈపీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ''ఈ ప్రభుత్వం, ఎన్ఈపీ మన మొత్తం సంస్కృతిని, మన దైనందిన జీవితాలను కాషాయికరణ చేయడానికి ప్రయత్నిస్తాయి. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత.. మళ్లీ అదే తరహా సమస్యలోకి తిరిగి వెళ్లడం దురదృష్టకరం అని ఆయన అన్నారు.
ఎంపీ మనోజ్ ఝా.. ఎన్ఈపీని మ్యూచువల్ ఫండ్ నిరాకరణ విభాగంతో పోల్చారు, ఇందులో వినియోగదారుకు వ్యతిరేకంగా సాధ్యమయ్యే అన్ని నష్టాలు, నిబంధనలు మరియు షరతులు ఉన్నాయని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ రతన్ లాల్, ఎటువంటి చర్చ లేకుండా ఎన్ఈపీని నెమ్మదిగా ఎలా అమలు చేయబడుతుందనే అంశాన్ని లేవనెత్తారు, అలాగే, రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన వాటిపై దాడి చేస్తూ ''విద్యను అపహాస్యం'' చేస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం డాక్యుమెంట్లో రిజర్వేషన్ ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు నందితా నరైన్, లాల్‌తో ఏకీభవించారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌషుమి బసు.. విద్య ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా దీని వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఎంత అప్రజాస్వామికంగా ఎన్ఈపీని సర్కారు తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 'నూతన విద్యా విధానం విద్య రుణ నమూనాను ప్రోత్సహిస్తుంది. ఇది భారీ ఫీజు పెంపునకు దారి తీస్తుంది. పెట్టుబడిదారీ విధానంతో మన విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి జరుగుతున్న కుట్ర. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏకమై ఈ దాడిని ఎదుర్కోవాలి' అని ఆమె అన్నారు.