Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వస్త్ర, గృహోపకరణాలు ప్రియం
- పలు ఉత్పత్తులపై జిఎస్టి పెంపు
- ద్రవ్యోల్బణం ఎగిసిపడొచ్చు
న్యూఢిల్లీ : వచ్చే కొత్త ఏడాదిలో సామాన్యులపై ధరల పిడుగు పడనుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతోన్న పేద, మధ్య తరగతి ప్రజలపై మరోసారి ఆర్థిక భారం పడనుంది. పలు ఉత్పత్తులపై జిఎస్టి పెంపునకు తోడు ముడి సరుకుల ధరలు, ఇంధన భారాల నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వస్త్రాలు, గృహోపకరణాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఉత్పత్తి వ్యయాలు, రవాణ ఖర్చులు పెరిగిపోవడమే ప్రధాన కారణం. ఎఫ్ఎంసిజి కంపెనీలు వచ్చే మూడు మాసాల్లో 4-10 శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇప్పటికే 3-5 శాతం మేర ధరలు పెంచగా.. మరోసారి ఫ్రిజ్, ఎసి, వాషింగ్ మెషీన్ ధరలను 6-10 శాతం వరకు పెంచడానికి సిద్దం అవుతున్నాయి. 2020లో ఇప్పటి వరకు మూడు సార్లు ధరలను పెంచేశాయి. కొత్త ఏడాదిలోనూ బాదడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
పలు వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను పలు మార్లు పెంచగా.. వచ్చే కొత్త ఏడాదిలోనూ మరోసారి పెంచనున్నట్లు ఇప్పటికే పలు కంపెనీలు ప్రకటన చేశాయి. జనవరి 4 నుంచి ద్విచక్ర వాహన ధరలు పెంచనున్నట్లు హీరో మోటొకార్ప్ ఇప్పటికే ప్రకటించింది. పలు వాహన కంపెనీలు ఇదే బాటలో ఉన్నాయి. ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలు హిందుస్తాన్ యూనిలివర్, డాబర్, బ్రిటానియా, మారికో వంటి పలు కంపెనీలు గడిచిన రెండు త్రైమాసికాల్లో తమ ఉత్పత్తులపై 5 నుంచి 12 శాతం వరకు ధరలను పెంచాయి. కొత్త ఏడాదిలోనూ ధరల పెంపునకు సమీక్షలు చేస్తోన్నట్లు సమాచారం.
జనవరి ఒక్కటో తేది నుంచి దుస్తులపై జిఎస్టిని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశం దీనికి ఆమోదం తెలిపింది. దీంతో రూ.1000 లోపు దుస్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయని ఆ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రూ.1000 లోపు పాదరక్షల ఉత్పత్తులపై 5 శాతం జిఎస్టి ఉండగా.. కొత్త ఏడాదిలో 12 శాతం పన్ను అమల్లోకి రానుంది. దీంతో చెప్పులు, బూట్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు స్విగ్గీ, జొమాటో తదితర ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌పై బుకింగ్ చేసుకునే అహారంపై ఇక 5 శాతం జిఎస్టి వినియోగదారులే చెల్లించాల్సి ఉటుంది. ఇప్పటి వరకు ఈ పన్నును రెస్టారెంట్లు చెల్లించేవి. ధరలు, పన్నుల పెంపు వల్ల కొత్త ఏడాదిలో ద్రవ్యోల్బణం ఎగిసి పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి మరింత హరించుకుపోవచ్చని విశ్లేషిస్తున్నారు. 2021 ప్రారంభంలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 4 శాతం వద్ద ఉండగా.. మధ్య నాటికి ఇది 6 శాతానికి ఎగిసింది. ఇక టోకు ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 2.29 శాతం నుంచి నవంబర్‌లో రికార్డ్ స్థాయిలో 14.23 శాతానికి చేరి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ద్రవ్యోల్బణం సెగలు గక్కుతోందని అనేక రిపోర్ట్ల్లో వెల్లడయ్యింది. అధిక ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లను విసురుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.