Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) ఈశాన్య భారతాన్ని కుదిపేస్తున్నది. చాలా కాలం నుంచి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో పోరాటం కొనసాగుతోంది. అయితే, ఇటీవల నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో మిలిటెంట్లుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఏఎఫ్ఎస్పీఏ మళ్లీ తెరమీదకు వచ్చింది. అక్కడి ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల అధికార, విపక్ష పార్టీలు సైతం ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా అమల్లో ఉన్న వివాదాస్పద ''సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1958'' విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే అవకాశాలను పరిశీలించడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
నాగాలాండ్, అసోం ముఖ్యమంత్రులు నియో ఫియు రియో, హిమంత బిశ్వ శర్మతో.. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా డిసెంబర్ 23న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుగా ఉంటారని ఆదివారం నాగాలాండ్ సీఎం నియో ఫియు రియో తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రత్యేక అధికారాల చట్టంపై కేంద్రం తుదినిర్ణయం తీసుకోనుందన్నారు. కాగా, కేంద్ర హౌంశాఖ అదనపు కార్యదర్శి (ఈశాన్యరాష్ట్రాలు), సీఎస్, నాగాలాండ్ డీజీపీ, అసోం రైఫిల్స్ ఐజీ, సీఆర్పీఎఫ్ నుంచి ఓ ప్రతినిధి కమిటీ సభ్యులుగా ఉంటారు. 45 రోజుల్లోగా ప్యానెల్ తమ ప్రతిపాదనలు, సూచనలు సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ సిఫార్సుల మేరకు చట్టాన్ని తొలగించాలా, వద్దా అనేదానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది.
కాగా, ఏఎఫ్ఎస్పీఏ భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది. దీని ప్రకారం.. ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఆపరేషన్లు నిర్వహించవచ్చు. బలగాలు ఎవరినైనా కాల్చి చంపినా.. వీరికి రక్షణ లభిస్తుంది. అయితే చాలా ఏండ్ల నుంచే ఈ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ..ఇటీవల మోన్ జిల్లా ఘటన తర్వాత ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.