Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్నప్పటికీ వచ్చే ఏడాది జరగాల్సిన ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్ర్ర అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, ఈ నూతన మహమ్మారి ఉధతి నేపథ్యంలో ఎన్నికలను నెల లేదా రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు ఎన్నికల సంఘానికి సిఫారసు చేసిన సంగతి విదితమే. అయితే ఆయా రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం గడువు పూర్తి కావడానికి ముందే ఎన్నికలు కచ్చితంగా నిర్వహించాలన్న రాజ్యాంగ ఆదేశాలను అనుసరిస్తూ ఎన్నికల కమిషన్.. ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
గోవా అసెంబ్లీ పదవీకాలం మార్చి 15న ముగిసిపోతుండగా.. మణిపూర్ అసెంబ్లీ మార్చి 19, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మే 14న పదవీకాలం ముగియనుంది. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సోమవారం ఆరోగ్య శాఖ కార్యదర్శితో భేటీ అయింది. వ్యాక్సిన్ కవరేజ్, మహామ్మారి వ్యాప్తి గురించి అడిగి తెలుసుకుంది. అదేవిధంగా కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్ అవసరంపై ఇసి చర్చించింది. కాగా, ఇసి మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనుంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో బందోబస్తు ఏర్పాట్లపై భద్రతా బలగాల చీఫ్‌లతో కూడా అధికారులు భేటీ కానున్నారు.