Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రారుపూర్ : దేశంలో హిందూత్వ నేతల మాటలకు హద్దు లేకుండా పోయింది. హరిద్వార్‌లో నిర్వహించిన ధర్మసంసద్‌లో విద్వేషపూరిత ప్రసంగాల చేసి విమర్శలు పాలైన హిందూత్వ శక్తులు.. మరోసారి తమ పైత్యాన్ని ప్రదర్శించాయి. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే గొప్పవాడని పొగుడుతూ వార్తల్లో నిలిచారు మరో హిందూత్వ నేత కాళి చరణ్ మహారాజ్. మహారాష్ట్రకు చెందిన కాళిచరణ్.. చత్తీస్‌గఢ్‌లోని రారు పూర్లో ధర్మ సంసాద్ పేరిట చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని విద్వేషపూరిత ప్రసంగం చేశారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు చేయడంతో.. వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలపై కాళి చరణ్‌పై కేసు నమోదు చేశారు. కాగా, కాళి చరణ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ మాక్రాం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన మహంత్ రామ్‌సుందర్ దాస్.. ఆయన ప్రసంగం నచ్చక ... కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ప్రసంగానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇందులో రాజకీయాల ద్వారా దేశాన్ని వశపర్చుకోవాలని ఇస్లాం మతం చూస్తోందని, గాంధీ దేశాన్ని విధ్వంసం చేశారని, ఆయనను చంపిన నాథూరాం గాడ్సేకు వందనాలు అని విద్వేషపూరిత ప్రసంగం చేశారు. హిందూ మతాన్ని రక్షించేందుకు సరైన నాయకుడ్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ రామ్‌సుందర్ దాస్.. మహత్మాగాంధీ ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఇది సనాతన ధర్మం కాదని, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు ఖండించడం లేదంటూ ఆర్గనైజర్లను ప్రశ్నించారు. ఇక్కడ 30 కోట్ల మంది ముస్లింలు, 15 కోట్ల మంది క్రిస్టియన్లు నివసిస్తున్నారని, అలా అయితే ఇది హిందూ దేశం కాకుండా పోతుందా అంటూ ..తాను ఈ కార్యక్రమానికి చెందిన వాడిని కాదంటూ వేదిక దిగి వెళ్లిపోయారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కమ్యూనికేషన్ వింగ్ సుశీల్ ఆనంద్ శుక్లా స్పందిస్తూ. మహత్మాగాంధీపై ఇటువంటి నీచమైన పదజాలం వినియోగించడం అభ్యంతరకమని, తొలుత కాళిచరణ్ ఓ స్వామిజీ అని నిరూపించుకోవాలని అన్నారు. మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్ సైతం.. విమర్శించారు. మహత్మాగాంధీతో పాటు దేశాన్ని అవమాన పరిచారని, కాళి చరణ్‌పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.