Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు, మూడో స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ
- దిగజారిన ఏపీ ర్యాంక్
- అట్టడుగున ఉత్తరప్రదేశ్ : నిటి అయోగ్
న్యూఢిల్లీ : ఆరోగ్య రంగంలో పనితీరుకు సంబంధించి కేరళ (82.20 స్కోర్) మరోసారి ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ (30.57 స్కోర్) అత్యంత అధ్వానమైన రాష్ట్రంగా నిలిచిందని నిటి ఆయోగ్ పేర్కొంది. రెండు, మూడు స్థానాల్లో వరుసగా తమిళనాడు (72.42 స్కోర్), తెలంగాణ (69.96 స్కోర్) నిలిచాయి. అన్ని రకాలుగా ఉత్తమ పనితీరును ప్రదర్శిస్తూ కేరళ వరుసగా నాలుగో సారి అగ్ర స్థానాన్ని దక్కించుకుందని నిటి ఆయోగ్ నివేదిక పేర్కొంది. సోమవారం నాడిక్కడ నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్, అదనపు కార్యదర్శి రాకేష్ సర్వాల్, ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆరోగ్య నిపుణుడు షీనా ఛబ్రాలు 2019-20 రాష్ట్రాల ఆరోగ్య ఇండిక్స్ను 'హెల్తీ స్టేట్స్, ప్రొగ్రసివ్ ఇండియా' పేరుతో నిటీ ఆయోగ్ నాలుగో ఆరోగ్య సూచీ నివేదిక విడుదల చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో, ప్రపంచ బ్యాంక్ సాంకేతిక సాయంతో ఈ నివేదికను రూపొందించారు. ఇక అత్యంత అధ్వాన్నమైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తరువాత స్థానాల్లో బీహార్ (31 స్కోర్), మధ్యప్రదేశ్ (32.72 స్కోర్) ఉన్నాయి. అయితే బేస్ ఇయర్ 2018-19తో పోల్చుకుంటే 2019-20లో అన్ని రాష్ట్రాల పనితీరు మెరుగుపడిందని నివేదిక తెలిపింది. ఇక చిన్న రాష్ట్రాలకు సంబంధించి మిజోరాం (75.77 స్కోర్) ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. రెండు, మూడో స్థానంలో వరుసగా త్రిపుర(70.16స్కోర్),సిక్కిం (55.53 స్కోర్)రాష్ట్రాలు నిలిచాయి. చిట్ట చివరి స్థానాల్లో నాగాలాండ్ (27 స్కోర్), అరుణాచల్ ప్రదేశ్ (33.91స్కోర్), మణిపూర్ (34.26 స్కోర్) రాష్ట్రాలు నిలిచాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మొత్తం పనితీరులో మొదటి స్థానంలో దాద్రా నగర్ హావేలీ, డామన్ డయ్యు (66.19 స్కోర్) నిలిచింది. చివరి స్థానాల్లో ఢిల్లీ (49.85 స్కోర్), జమ్ము కాశ్మీర్ (47 స్కోర్) ఉన్నాయి. బేస్ ఇయర్ నుంచి గత ఏడాదికి మెరుగుపడిన పనితీరు (ఇంక్రిమెంటల్ పెరఫార్మెన్స్)ను గమనంలోకి తీసుకుంటే ఈ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. అటు మొత్తం పనితీరులోనూ ఇటు ఇంక్రిమెంటల్ పెరఫార్మెన్స్లోనూ తెలంగాణ మంచి గణాంకాలనే నమోదు చేసింది. రెండింటిలోనూ మూడవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రెండు రంగాల్లోనూ పేలవమైన పనితీరునే కనబరిచింది.
నాలుగోస్థానానికి ఏపీ
ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ (69.95 స్కోర్) నాలుగో స్థానంలో నిలిచింది. కాకపోతే గత నివేదిక (2018-19) కంటే ఇప్పుడు ఒక స్థానం దిగజారింది. 2018-19లో ఏపీ (68.88 స్కోర్) మూడో స్థానంలో నిలవగా, ఇప్పుడు నాలుగో స్థానానికి దిగజారింది. ఏపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా గతం కంటే దిగజారాయి.
కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ముందు వరుస (ఫ్రంట్ రన్నర్స్)లో నిలిచాయి.