Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల ప్రయివేటీకరణపై వెనక్కితగ్గిన బీజేపీ
- రైతు ఉద్యమంలా బ్యాంకు ఉద్యోగులు దెబ్బతీస్తారనే బ్యాక్‌ఫుట్!
- ఎన్నికల ఎజెండాతోనే తాత్కాలిక వాయిదా..!
న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు సాగు చట్టాల అనుభవంతో, ప్రధాని మోడీ ప్రభుత్వం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించాలనే ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. బ్యాంకు సంఘాల నిరసనలు వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీజేపీని దెబ్బతీస్తాయనే భయంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ, బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలను ప్రవేశపెట్టకపోవడానికి నిరసనల భయం ఒక కారణమని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ''బిల్లు ముసాయిదా క్యాబినెట్ పరిశీలనకు సిద్ధంగా ఉంది. ఎన్నికలు ముగిసే వరకు ఈ బిల్లులపై విరామం అని అర్థం. కాబట్టి, ఇది ఇప్పుడు బడ్జెట్ సమావేశాల ద్వితీయార్ధంలో లేదా బహుశా తరువాత మాత్రమే తీసుకోబడుతుందని తెలుస్తోంది'' అని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. బ్యాంకింగ్ కంపెనీల (అక్విజేషన్ అండ్ ట్రాన్స్ ఫర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) చట్టాలు-1970, 1980లో మార్పులు, బ్యాకింగ్ నియంత్రణ చట్టం-1949లో సవరణలు తీసుకురావడానికి, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించడానికి బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) బిల్లు-2021ను లోక్‌సభ బులిటెన్‌లో జాబితా చేయబడింది. పీఎస్బీలలో ప్రస్తుతం ఉన్న 51 శాతం వాటాను 21 శాతానికి తగ్గించగలదని స్పష్టంగా తెలుస్తోంది. రెండు పీఎస్‌బీల ప్రయివేటీకరణపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ''పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన వివిధ సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం దీని కోసం నియమించిన క్యాబినెట్ కమిటీకి అప్పగించబడింది. ఈ విషయంలో క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకోలేదు'' అని అన్నారు. ఇదిలావుండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ 2021-22లో సీతారామన్.. ఐడీబీఐ బ్యాంకు కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు పీఎస్‌బీలు, ఒక బీమా సంస్థను ప్రభుత్వం ప్రయివేటీకరించనున్నట్టు ప్రకటించారు. బ్యాంకింగ్ బిల్లు సవరణలను పార్లమెంటులో తీసుకురాలేకపోయినప్పటికీ, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఒక సాధారణ బీమా సంస్థను ప్రయివేటీకరించడానికి వర్షాకాల సమావేశాల్లో సాధారణ బీమా బిల్లులో మార్పులు చేయబడ్డాయి. ఇదిలావుండగా, ప్రభుత్వ ప్రయివేటీకరణ ప్రణాళికలను వ్యతిరేకిస్తూ.. అనేక బ్యాంకు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిసెంబర్ 16 నుంచి రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె నిర్వహించింది. వివిధ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులకు చెందిన దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు.