Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతతత్వ, కార్పొరేట్ రాజకీయాలకు అదే సమాధానం
- దేశ రక్షణకు మోడీని గద్దె దించాలి
- ఫెడరల్ విఘాతంపై ప్రాంతీయపార్టీలు కలిసి రావాలి : సీతారాం ఏచూరి పిలుపు
- ఉత్సాహ భరితంగా సీపీఐ(ఎం) 26వ ఏపీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
తాడేపల్లి : కార్పొరేట్ల లూటీ, మతతత్వ రాజకీ యాలకు వ్యతిరేకంగా బలమైన ప్రతిఘటనోద్య మాలు నిర్మించాలని భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించుకోవా లంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించా లని చెప్పారు. ఐక్య పోరాటాలే మోడీ సర్కారు విధానాలకు సమాధానమన్నారు. సమాఖ్య వ్యవ స్థకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్ర వైఖరిపై బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని పేర్కొన్నారు. మూడు రోజులపాటు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) 26వ ఏపీ రాష్ట్ర మహాసభలు సోమవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అధ్యక్షత వహించారు. ఏచూరీ ప్రారంభోపన్యాసం చేస్తూ కోవిడ్ కంటే ముందు నుండే ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోందనీ, దాని నుంచి బయట పడటానికి సామ్రాజ్యవాదం మిలటరీ జోక్యాలు, ఆర్థిక దిగ్బంధనాలు, ఆంక్షలకు పాల్పడుతోందని చెప్పారు. పెట్టుబడిదారీ దేశాల్లో అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు నడుస్తున్నా యన్నారు. ఈ పోరాటాలను విచ్ఛిన్నం చేసేదాంట్లో భాగంగా అభివృద్ధి నిరోధక, మితవాద ప్రభుత్వాలు ఏర్పాటై మరింత నిరంకుశత్వాన్ని ప్రయోగిస్తున్నాయని వివరించారు. ఈ క్రమంలోనే మన దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వ స్థాపన అని చెప్పారు. ఈ కాలంలోనే చిలీ, పెరు వంటి దేశాల్లో ప్రజాఉద్యమాలు విజయవంతమై ఫాసిస్టు ప్రభుత్వా లను దించి వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం సామ్రాజ్యవాదం, సోషలిస్టు మధ్య వైరుధ్యం కొనసాగుతోందని, అందులో భాగంగానే చైనాను అమెరికా ఒంటరిపాటు చేయాలని ప్రయత్నిస్తుండగా చైనా దీటుగా ఎదుర్కొంటోందని చెప్పారు. కోవిడ్ వచ్చాక ప్రజలపై ఆర్థిక దోపిడీ తీవ్రమైందని, ప్రభుత్వాల ఉద్దీపన, ఉపశమన ప్యాకేజీలతో కార్పొరేట్లు లాభాలు పెంచుకుంటున్నాయని, సంక్షోభ సమయంలోనూ స్టాక్‌మార్కెట్ బూమ్ వెనుకనున్న మర్మం ఇదేనని అన్నారు. వ్యాక్సినేషన్లోనూ అసమానతలు, పేటెంట్ పొందాలన్న తపన పెట్టుబడిదారీ క్రూరత్వంగా అభివర్ణించారు.
మరో మార్గం లేదు
ఒక్కసారి మతతత్వాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదకరమో మోడీ సర్కారు రుచి చూపించిందని ఏచూరీ అన్నారు. 'స్వాతంత్య్రోద్య మంలో మూడు స్రవంతులు ప్రభలాయి. సెక్యులర్ డెమొక్ర టిక్ రాజ్యం కావాలంది కాంగ్రెస్. సెక్యులర్ డెమొక్రటిక్తో పాటు ప్రతి వ్యక్తికీ ఆర్థిక స్వాతంత్య్రం కావాలని కమ్యూనిస్టులు ఆకాంక్షించారు. మతం ఆధారంగా దేశం ఏర్పాడాలని ఆర్ఎస్ఎస్ చెప్పింది. అప్పటి నుండి నిరంతరం ఆర్ఎస్ఎస్ హిందూ మత రాజ్య స్థాపనకు పని చేస్తోంది' అని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే లౌకికత్వ పునాదిని సర్వనాశనం చేస్తోందన్నారు. 'మొన్న హరిద్వార్‌లో నిర్వహించిన సాధుసంత్ సమావేశంలో ముస్లింలు, క్రైస్తవులపై సాయుధ దాడులు చేయాలని పిలుపునివ్వడం అతి పెద్ద బరితెగింపు' అన్నారు. సెక్యులరిజంపై, ప్రజాస్వామ్య హక్కులపై, ఫెడరలిజంపై, సామాజిక న్యాయంపై మోడీ ప్రభుత్వం పథకం ప్రకారం దాడి చేస్తోందని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. మానిటైజేషన్, ప్రయివేటీకరణ కార్పొరేట్ల దోపిడీకేనన్నారు. వీటన్నింటికీ ఐక్య పోరాటాలతోనే సమాధానం చెప్పాలన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమ విజయం, సిఎఎను ప్రతిఘటిస్తూ సాగిన సుదీర్ఘ పోరాటాలు మార్గదర్శకంగా నిలిచాయన్నారు.
రాష్ట్రానికి ఆ చరిత్ర ఉంది
రాష్ట్రాల హక్కులకు, సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగిన ప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రాలను కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఏచూరీ గుర్తు చేశారు. అప్పుడే కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్ వచ్చిందన్నారు. జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలకు కేంద్రం నిధులు కుదించిందని, పూర్తిగా రాష్ట్రాల పరిధిలోకొచ్చే సహకార మంత్రిత్వశాఖను కేంద్రంలో నెలకొల్పి అమిత్‌షాకు ఆ బాధ్యతలు ఆప్పగించిందని చెప్పారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకొచ్చి రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రాన్ని ప్రతిఘటించాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ప్రత్యేక హోదా ఐదేండ్లు సరిపోదు పదేండ్లు కావాలన్న బీజేపీ, అనంతరం ఎగ్గొట్టిందని పేర్కొన్నారు. 'విశాఖ ఉక్కు మన హక్కు' అని కేంద్రంపై పోరాడి సాధించుకోగా, ఇప్పుడు దాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు. రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిన బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీ స్పందించాలన్నారు. ఆ పార్టీలు స్పందించేలా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఏచూరీ పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పోరాటాల గడ్డపై పార్టీ మహాసభలు నిర్వహించుకుంటున్నామని, ఆ స్ఫూర్తితో భవిష్యత్తు కర్తవ్య కార్యాచరణను రూపొందించాలని, సోషలిజం సాధనకు నడుం కట్టాలని అన్నారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు, ఎంఎ గఫూర్, ఎస్ పుణ్యవతి, కె హేమలత, ఆర్ అరుణ్, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పాటూరు రామయ్య, బిఆర్ తులసీరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేదికపై ఆశీనులయ్యారు.