Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలతో సహ పలువురు వైద్యులకు గాయాలు
- ఖండించిన సీపీఐ(ఎం)
- మోడీకి కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ : నీట్- పీజీ 2021 కౌన్సెలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ రెసిడెంట్ వైద్యులు న్యూఢిల్లీలో కొద్ది రోజులుగా చేపడుతోన్న ఆందోళనలు ఉద్రికత్తంగా మారాయి. సోమవారం మహిళా వైద్యులతో పోలీసులు దాడులు చేయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళుతున్న వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల దౌర్జన్యంలో అనేక మంది వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. నిరసన తెలుపుతున్నవారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఆసుపత్రిలోని అన్ని ప్రధాన గేట్లను మూసేశారు. దీంతో లోపలే పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగుతున్నాయి. 'చివరి ప్రయత్నంగా ఈ నిరసన తెలుపుతున్నాం. కానీ, ప్రభుత్వం వినడం లేదు. మేం ఏం చేయాలి?' అని ఓ రెసిడెంట్ వైద్యుడు మీడియాతో చెప్పారు.
కాగా, సోమవారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజాధనాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ఎపిడమిక్ డిసిజ్ యాక్ట్ కింద ఐపి ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో నిరసన వైద్యులపై అభియోగాలు మోపారు.
రెసిడెంట్ వైద్యులతో పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ.. రెసిడెంట్ వైద్యుల సంఘం సమాఖ్య(ఎఫ్ఓఆర్డీఏ) మంగళవారం నుంచి అన్ని వైద్య సంస్థల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఎఫ్ఏఐఎంఏ) బుధవారం ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
సమ్మె చేస్తున్న రెసిడెంట్ వైద్యులపై ఢిల్లీ పోలీసుల చర్యను సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మహిళా వైద్యులను పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మోడీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం , ప్రమాణాలపై నివేదికను సుప్రీం కోర్టు సమర్పించడంలో వైఫల్యం కారణంగా నీట్ కౌన్సిలింగ్ ఆరు నెలలకు పైగా ఆలస్యమయిందని ఆరోపించింది. కోర్టు విచారణలను వేగవంతం చేయాలని, అలాగే 2021 కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే రెసిడెంట్ వైద్యుల డిమాండ్‌ను వెంటనే నెరవేర్చాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఒమిక్రాన్ ముప్పు పొంచి వున్న నేపధ్యంలో వైద్యులను సమ్మె చేసే విధంగా చేసి కరోనా రెండో దశలో చేసిన తప్పులను కేంద్ర ప్రభుత్వం మళ్లీ పునరావతం చేస్తుందని సీపీఐ(ఎం) విమర్శించింది.
వైద్యులసమ్మెపై తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం లేఖ రాసారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వైద్యులు ఆసుపత్రుల్లో ఉండాలని కానీ, వీధుల్లో కాదని అన్నారు. ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే నీట్-పీజి కౌన్సిలింగ్‌ను వేగవంతం చేయాలని ప్రధానిని కోరారు. ప్రధానికి రాసిన లేఖను క్రేజీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అలాగే వైద్యులపై పోలీసుల దౌర్జనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వైద్యుల డిమాండ్లను మోడీ వెంటనే ఆమోదించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.