Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్రాస్ హైకోర్టు
న్యూఢిల్లీ : వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన కంటెంట్‌కు అడ్మిన్లు బాధ్యులు కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అడ్మిన్లకు గ్రూపులో సభ్యులను జోడించడం, తొలగించడం వంటి పరిమితి అధికారాలే ఉంటాయని, గ్రూపులో పోస్ట్ చేసే కంటెంట్‌ను నియంత్రించే లేదా సెన్సార్ చేసే అధికారం వారికి లేదని హైకోర్టు పేర్కొంది. 'కరూర్ లాయర్స్' అనే ఒక వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తున్న ఒక న్యాయవాది వేసిన పిటీషన్ విచారణలో మధురై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తన గ్రూపులో ఇతర సభ్యుడు పోస్ట్ చేసిన అభ్యంతర కంటెంట్‌కు తనను బాధ్యున్ని చేస్తూ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని న్యాయవాది పిటీషన్లో కోరారు.
ఐపిసిలోని సెక్షన్ 153ఎ, సెక్షన్ 294(బి) కింద కేసును నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో బాంబే హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగా, పిటిషనర్‌కు (వాట్సాప్ అడ్మిన్) ఊరట ఇచ్చే విధంగా ధర్మాసనం తాజా తీర్పు ఇచ్చింది. గ్రూప్ సభ్యుడు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌కు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌పై 'వికారియస్ బాధ్యత' లేదని తెలిపింది. ఇటువంటి సెక్షన్లు నమోదు చేసినప్పుడు 'వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యుడు, అడ్మినిస్ట్రేటర్‌కు ఉమ్మడి ఉద్దేశం లేదా ముందుగా ఏర్పాటు చేసిన ప్రణాళిక ఉంది' అనే ఆధారాలు చూపాల్సి ఉందని మధురై ధర్మాసనం ప్రకటించింది. బాంబే హైకోర్టు తీర్పును గుర్తు చేస్తూ 'గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్న వాట్సాప్ సర్వీస్ యూజర్‌కు ఉమ్మడి ఉద్దేశాన్ని ఆపాదించలేము. ఒక వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌ని ఏర్పాటు చేసినప్పుడు, గ్రూప్ సభ్యుని నేరపూరిత చర్యల గురించి అడ్మినిస్ట్రేటర్ ముందుగానే ఊహించి ఉంటాడని లేదా ముందుగానే తెలుసుకోవాలని మనం అనుకోకూడదు' అని మధురై ధర్మాసనం తెలిపింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తుంచుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.