Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షకు ఒకరోజు ముందు ప్రశ్నా పత్రం లీక్
- ఇలా జరగటం 8వసారి
న్యూఢిల్లీ : గుజరాత్లో 'హెడ్ క్లర్క్స్' పోస్టులకు జరిగాల్సిన పరీక్ష రద్దు అయ్యింది. 186 పోస్టులకు గుజరాత్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(జీఎస్ఎస్ఎస్బీ) నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకైందని ఆరోపణలు వెలువడ్డాయి. పలు జిల్లాల్లో పరీక్ష తేదీ డిసెంబర్ 12కు ఒక రోజు ముందు ప్రశ్న పత్రం లీకైందని పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఈ పరీక్షను రద్దు చేసి వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నామని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఉద్యోగ పోటీ పరీక్షల లీకవ్వటం ఒక ఆనవాయితీగా మారింది. జీఎస్ఎస్ఎస్బీ ఆధ్వర్యంలో తయారైన ప్రశ్నాపత్రం లీకవ్వటం ఇది 8వసారి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88వేల మంది అభ్యర్థులు హెడ్ క్లర్క్స్ పోస్టుల ఉద్యోగ పరీక్షకు సిద్ధమైనవేళ..హఠాత్తుగా పేపర్ లీక్ కావటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జీఎస్ఎస్ఎస్బీ చైర్మెన్ ఎ.ఆర్.వోరా వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. బీజేపీ నాయకుడు, అహ్మదాబాద్ మాజీ మేయర్ అయిన ఎ.ఆర్.వోరా 'జీఎస్ఎస్ఎస్బీ'కి చైర్మెన్‌గా వ్యవహరించటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పేపర్ లీకేజ్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, చైర్మెన్ పదవి నుంచి వోరాను తప్పించాలని కాంగ్రెస్, ఆప్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.