Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అక్రమాల్లో రూ.15 లక్షలకు మించితేనే అది అవినీతి అవుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా అవినీతికి కొత్త నిర్వచనం చెప్పారు. సర్పంచ్‌లు రూ.15లక్షలకు పైబడి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే తనను సంప్రదించాలని ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన 'ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో మీడియా పాత్ర' అనే సెమినార్లో ఎంపీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సెమినార్‌కు హాజరైనవారు ఆయన చేసిన వ్యాఖ్యలు విని కంగుతిన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పన్ను ఎగవేత కేసులో పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్‌కు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన మరుసటి రోజే ఎంపీ వ్యాఖ్యలు మీడియాలో దుమారంరేపాయి.
అవినీతిపై యూపీలో సమాజ్‌వాదీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వ్యాపారి జైన్‌తో వివాదాస్పద సంబంధాలు కలిగివున్నారని బీజేపీ నాయకులపై అరోపణలు వెలువడుతున్నాయి. కాన్పూర్‌లోని జైన్ నివాసం, కన్నాజ్ ప్రాంతంలోని నివాసం, ఫ్యాక్టరీలపై జీఎస్టీ నిఘా అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.257 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి స్వాధీనం చేసుకొని జైన్‌ను అరెస్టు చేశారు.