Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న చేపను పెద్ద చేప మింగినట్టు..మధ్య దళారీలు, చిన్న వ్యాపారులు లేకుండా నేరుగా తామే కొనుగోలు చేసేందుకు కార్పొరేట్ వర్గం సిద్ధమవుతోంది. తమకు అనుకూలమైన నిబంధనలు, చట్టాలు తీసుకురావ టంలో సక్సెస్ అయ్యాయి. మార్కెట్ తలుపులు బార్లా తెరవాలని కోరినందువల్లే మోడీ సర్కార్ మూడు సాగు చట్టాల్ని చేసింది. భారీ పెట్టుబడులు, మౌలిక వసతులు, మార్కెట్ అవకాశాలున్న కార్పొరేట్ వర్గం వ్యవసాయరంగాన్ని అమాంతం మింగేయాలన్న ఆశతో ఎదురుచూస్తోంది. మరోవైపు చాలా మంది చిన్న, సన్నకారు రైతులు తమ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పొందటం లేదు. ఒకవేళ ఎంఎస్పీ లభించినా..వాటి డబ్బులు సకాలంలో రైతులకు రావటం లేదు. పంట కొనుగోళ్లు, ఎంఎస్పీ అమలు విషయంలో నెలకొన్న విపరీతమైన జాప్యం రైతుల్ని నిండా ముంచుతోంది. ఈ వ్యవహారంతో విసిగి వేసారిన రైతులు ప్రయివేటు కొనుగోలుదార్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోంది. సామాన్య రైతు అప్పుల బాధలతో ఆత్మహత్య బాట పడుతున్నాడు. చట్టబద్ధమైన ఎంఎస్పీ తీసుకొస్తే ప్రయివేటు కొనుగోలుదార్ల దోపిడి నుంచి రైతుకు రక్షణ లభిస్తుందని రైతు సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.