Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపద పోగేసుకుంటున్న ఫార్మా కంపెనీలు
- పేద దేశాల్లో వ్యాక్సిన్ అవసరమున్నా... కార్పొరేట్లు నిరాకరణ
- బూస్టర్ డోస్ అంటూ మళ్లీ దందా
ఫార్మా కంపెనీల దోపిడీ అనంతం
'ఫార్మా కంపెనీల తీరు చూస్తుంటే అసహ్యమేస్తున్నది . ఒమిక్రాన్ వేరియంట్ వార్త వ్యాప్తి చెందడంతో ఫైజర్, మోడర్నాకు చెందిన ఎనిమిది మంది పెట్టుబడిదారులు ఏకంగా రూ. 75,000 కోట్లు ఆర్జించారు. ఇలాంటి ఫార్మా కంపెనీలు తమ అత్యాశను నియంత్రించి ప్రపంచానికి వ్యాక్సిన్‌ను ఇచ్చి ఆదుకోవాల్సిన సమయం ఇది. కానీ దోపిడీ మరీ ఎక్కువైంది!'
- 2021.. డిసెంబర్ 6.. యూఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ ట్వీట్
కరోనా నుంచి ప్రాణాలను కాపాడాల్సిన వ్యాక్సిన్ కంపెనీల గురించి బెర్నీ శాండర్స్ ఎందుకు ఇంత ఘాటుగా విమర్శించారు..? దీని వెనుక రెండు పెద్ద కారణాలున్నాయి...
1. కొత్త వేరియంట్ విజృంభిస్తున్నదనగానే.. బూస్టర్ డోస్‌లను వ్యాక్సిన్ కంపెనీలు సంపాదన సాధనంగా చేసుకుంటున్నాయి.
2. కరోనా భయం చూపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కంపెనీలు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నాయి.
ప్రభుత్వాలు, వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, పెద్ద ఫార్మా కంపెనీలు మాత్రం అలా జరగాలని కోరుకోవడం లేదని బడా కార్పొరేట్లు భావిస్తున్నారు.
సంపన్న దేశాలతో ఒప్పందం...
పేద దేశాలకు తిరస్కరణ
పీపుల్స్ వ్యాక్సినేషన్ అలయన్స్ ( పీవీఏ) విశ్లేషణ ప్రకారం.. మూడు ప్రధాన వ్యాక్సిన్ కంపెనీలైన ఫైజర్, మోడెర్నా, బయోఎన్‌టెక్ 2021లో ప్రతి సెకనుకు వెయ్యి డాలర్ల మేర లాభాన్ని ఆర్జించాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో నేతల బలహీనతల్ని ఆధారంగా చేసుకుని.. సంపన్న దేశాల ప్రభుత్వాలతో లాభదాయకమైన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. మరోవైపు పేద దేశాల్లో వ్యాక్సిన్ డిమాండ్ ఉన్నా పంపిణీని నిలిపివేశాయి. పీవీఏ సమాచారం మేరకు.. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు..ఉత్పత్తి చేసిన మొత్తం వ్యాక్సిన్ సరఫరాలో కేవలం ఒక్క శాతం మాత్రమే పేద దేశాలకు పంపగా,మోడెర్నా సరఫరాలో 0.2 శాతం మాత్రమే పంపింది.
కరోనా వైరస్ నిర్మూలన సాధ్యమా..?
ఇప్పటికీ పేద దేశాల జనాభాలో కేవలం రెండు శాతం మందికి టీకాలు వేశారు. అంటే 98 శాతం మందికి పూర్తిగా టీకాలు వేయబడలేదు. 'అవర్ వరల్డ్ ఇన్ డేటా' ప్రకారం.. దక్షిణ అమెరికాలో 55 శాతం మంది ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి మోతాదులో తీసుకున్నారు. ఉత్తర అమెరికా, యూరప్, ఓషియానియాలో సగం కంటే ఎక్కువ మంది ప్రజలు పూర్తి మోతాదును పొందారు.
అయితే ఆసియాలో కేవలం 45 శాతం మంది మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి మోతాదులో తీసుకోగలిగారు, ఆఫ్రికాలో ఈ సంఖ్య కేవలం 6 శాతం మాత్రమే. ఇజ్రాయెల్ వంటి దేశాలు నాల్గవ డోస్‌కు సిద్ధమవుతున్నాయి, పేద దేశాల జనాభాలో 94 శాతం మందికి మొదటి డోసే అందలేదు. వ్యాక్సిన్‌లో ఇంతగా అసమానతలు ఉంటే, కరోనా మహమ్మారి ఇప్పట్లో ముగియదని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది.
పీవీఏ విశ్లేషణ ప్రకారం.. వ్యాక్సిన్ కంపెనీలు బిలియన్ల డాలర్ల ప్రభుత్వ ఖజానాలనుంచి పొందాయి. అయినా పేద దేశాల కంపెనీలతో ఔషధాలను తయారు చేయడానికి సాంకేతికత, ఇతర సమాచారాన్ని పంచుకోవడానికి ఫార్మా కంపెనీలు నిరాకరిస్తున్నాయి. వాస్తవానికి పేదదేశాలకు సహకరిస్తే.. లక్షలాది మంది ప్రాణాలు కాపాడవచ్చు. కానీ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు అంతగా ఆసక్తి చూపటంలేదు.
2021..ఫిబ్రవరి 24..
ఈ నెల గుర్తుందా..?
కరోనా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పడగవిప్పింది. నాలుగు రెట్లు వేగంతో దేశ జనాభాపై కాటు వేసింది. వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఉవ్విళ్లూరుతోంది. భారతదేశం మరియు దక్షిణాఫ్రికా నాయకత్వంలో, 100 కంటే ఎక్కువ దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ) ఒక ప్రతిపాదనను తీసుకున్నాయి. వైద్య ప్రపంచంలోని మేధో సంపత్తి నిబంధనలను కొద్దిగా సడలించాలని డిమాండ్ చేసింది. తద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచవచ్చని అభిప్రాయపడింది. అయితే మోడీ సర్కార్ ఈ ప్రతిపాదన ఆమోదించకుండా ఉండటానికి బీజేపీ నాయకుల లాబీయింగ్ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు కథనాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో వ్యాక్సిన్ ఆవశ్యకత ఉన్నా.. కోవాగ్జిన్ టీకా ఇవ్వటానికి రెడీ అంటూ.. బ్రెజిల్‌తో భారత్ చేసుకున్న ఒప్పందం చేసుకున్నది. దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో పై అవినీతి మరక అంటింది. దేశాధినేతపై అవినీతి మీద విచారణ కొనసాగుతున్నది. ఆ దేశంలో ప్రజాగ్రహం వ్యక్తమైన విషయం విదితమే.
డౌన్ టు ఎర్త్ నివేదికలో ఏమున్నదంటే..
డౌన్ టు ఎర్త్ నివేదిక ప్రకారం...ఈ ప్రతిపాదనను నిలిపివేయడానికి అమెరికన్ ఫార్మా కంపెనీల సంస్థ 'ది ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమెరికా' కేవలం కొద్ది రోజుల్లోనే 50 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు 3 వేల 700 కోట్లు లాబీయింగ్ కోసం ఖర్చు చేసింది. ఇది ఒక్కటే కాదు.. ఔషధ కంపెనీల బలమైన లాబీయింగ్ కారణంగా భారత్ ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు.
టీకా ధర కంటే అధికంగా కుమ్ముడు
బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ నివేదిక ప్రకారం.. వ్యాక్సిన్ మోతాదును సిద్ధం చేయడానికి ఫైజర్ 1 డాలర్ లేదా సుమారు 75 రూపాయలు ఖర్చవుతుంది. కంపెనీ దాన్ని 30డాలర్లకు విక్రయిస్తున్నది. యూకే లాంటి దేశాలు 30 రెట్లు ఎక్కువ చెల్లించి ఫైజర్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేస్తున్నాయి.
గుత్తాధిపత్యాన్ని సద్వినియోగం చేసుకొని.. తమ మధ్య జరిగిన ఒప్పందాలు రహస్యంగానే ఉంటాయని ఫైజర్ తెలిపింది. యూకే ప్రభుత్వంతో ఆవిధంగా ఒప్పందం కూడా చేసుకున్నది. ఆక్స్‌ఫాం రిపోర్టు ప్రకారం..మోడెర్నా కూడా వ్యాక్సిన్ ధర కంటే 15 రెట్లు వరకు వసూలు చేస్తుంది.
విచక్షణారహిత ఆదాయాలు...
పేద దేశాలకు వ్యాక్సిన్‌కు నో
ఫైజర్కి చెందిన ఆల్బర్ట్ బోర్లా వ్యాక్సిన్ డోస్ ధర కచ్చితంగా లాజికల్‌గా ఉంటుందని అంటున్నారు. అధిక ఆదాయ దేశాలు, మధ్య-ఆదాయ దేశాలు, తక్కువ-ఆదాయ దేశాలలో వ్యాక్సిన్‌కి ఎంత ఖర్చవుతుంది. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి సంబంధించినంతవరకు ఫార్మా కంపె నీలు ఎంతవరకు కట్టుబడి ఉన్నాయనే దానిపైనే పెద్ద చర్చ.
పేద దేశాల కోసం 100 కోట్ల డోస్‌లను ఉంచినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. ఫైజర్ డోస్‌లో 41శాతం మధ్య, తక్కువ-ఆదాయ దేశాలకు ఇస్తుందంటున్నది. అయితే, పేద.. మధ్య-ఆదాయ దేశాలు వ్యాక్సిన్ పొందడంలో ఎందుకు ఆలస్యమవుతున్నది.అనే దానిపై ఎవరూ కచ్చితమైన సమాధానం ఇవ్వడం లేదు.ఇది పేద దేశాల్లోని భావితరాలపై పెను ప్రభావం పడనున్నదని పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.