Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజలకు ఆహార భద్రత : వ్యవసాయ నిపుణులు
- కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యానికి అడ్డుకట్ట
- రైతాంగ సంక్షోభానికి పరిష్కారం
న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగమంతా ఒక్కటైంది. రైతు ఉద్యమానికి కేంద్రం దిగిరాక తప్పలేదు. రాజకీయంగా దెబ్బతింటామన్న భయంతో మోడీ సర్కార్ మూడు సాగు చట్టాల్ని రద్దుచేసింది. ఈ ఒక్క ప్రకటనతో రైతు సంక్షోభం పరిష్కారం కాలేదని, చట్టబద్ధమైన ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) అమల్లోకి తేవాలని రైతు సంఘాల నాయకులు గట్టిగా కోరుతున్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగాన్ని కాపాడాలన్నా, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్నా..చట్టబద్ధమైన ఎంఎస్పీ అమలు ఒక్కటే పరిష్కారమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. నేడు కేంద్రం 23 పంటలకు ఎంఎస్పీ ప్రకటిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డుల్లో (మండీలు) ఎంఎస్పీ ధర వద్ద రైతుల నుంచి పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు జరిగేట్టు చూసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రయివేటు కొనుగోలుదారుల దోపిడిని అరికట్టడం కోసమే 1960లో ఆనాటి పాలకులు ఎంఎస్పీ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే దేశంలో నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత (1991 నుంచి) వ్యవసాయ రంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై ప్రభుత్వ సబ్సిడీ అంతా ఆగిపోయింది. ఇది సాగు ఖర్చును మరింత పెంచి రైతుపై భారాన్ని మోపింది. మరోవైపు వ్యవసాయ పరిశోధన, అభివృద్ధిపై ప్రభుత్వ వ్యయం పూర్తిగా క్షీణించింది. దీనివల్ల.. ఎరు వులు, పురుగుమందులు, ఇతర రసాయనాల వాడకం పెరగడానికి దారితీసింది. ఇదంతా కూడా వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈనేపథ్యంలో ఎంఎస్పీ లెక్కింపు శాస్త్రీయంగా జరగాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎంఎస్పీని ఎలా లెక్కగట్టాలి అన్నదానిపై స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్లో స్పష్టంగా వివరించారు. దీని ప్రకారం ఎంఎస్పీ ప్రకటించి..అది అమలయ్యేట్టు చూడాలని నేడు రైతు సంఘాలు ప్రధానంగా కోరుతున్నాయి.