Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు అధికారిపై 'హరిద్వార్ ప్రతినిధుల' వ్యాఖ్య
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఇటీవల ధర్మసంసద్‌లో ముస్లింలపై విద్వేష ప్రసంగాలు చేసిన హిందూత్వ నాయకులు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ''ధర్మ సంసద్'' మత కార్యక్రమంలో దేశంలోని ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన హిందూత్వ నాయకుల తాజా చర్య చర్చనీయాంశంగా మారింది. హిందువులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ మౌలానాలపై చర్య తీసుకోవాలని పేర్కొంటూ ధర్మ సంసద్‌లో పాల్గొన్న ఐదుగురు హరిద్వార్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. వీరిలో '' ధర్మ సంసద్'' కార్యక్రమాన్ని నిర్వహించిన హిందూ రక్షా సేనకు చెందిన ప్రబోధానంద్ గిరి, మత నాయకుడు యతి నరసింహానంద, పూజా శకున్ పాండే (సాధ్వి అన్నపూర్ణ), శంకరాచార్య పరిషద్ అధిపతి ఆనంద్ స్వరూప్, జితేంద్ర నారాయణ్ లు ఉన్నారు. హరిద్వార్ విద్వేషపూరిత ప్రసంగాల కేసుకు సంబంధించి వీరి పేర్లు ఎఫ్ఐఆర్లో కూడా ఉండటం గమనార్హం.
మౌలానాలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ పోలీసు అధికారి రాకేశ్ కథియత్ను కలిసిన సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు, చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. '' మీరు (పోలీసు అధికారి) పక్షపాతి కాదన్న సందేశాన్ని పంపాలి. మీరు ప్రభుత్వ అధికారి. అందరినీ సమానంగా చూడాలి. దానిని మేము కోరుకుంటున్నాం. మీరు ఎల్లప్పుడూ విజయం సాధించాలి'' అని పూజా శకున్ పాండే అన్న మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. హిందూత్వ నాయకుల ఫిర్యాదు కాపీని చేతిలో పట్టుకొని ఉన్న సదరు పోలీసు అధికారి వారు చెప్తున్న మాటలు వింటున్నారు. ఇంతలో యతి నరసింహానంద మాట్లాడుతూ.. '' ఈయన (పోలీసు అధికారి) మన వైపే ఉంటాడు'' అన్నాడు. దీంతో పోలీసు అధికారితో సహా అక్కడున్నవారంతా ఒక్కసారి బిగ్గరగా నవ్విన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
ముస్లింలను ఊచకోత కోయాలంటూ ఈనెల 17 నుంచి 20 మధ్య హరిద్వార్‌లో నిర్వహించిన ''ధర్మ సంసద్'' సభలో హిందూత్వ శక్తులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఈ విషయంపై తృణమూల్ నాయకుడు, ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభోదానంద్ గిరి, యతి నరసింహానంద్, పూజా శకున్, సాధ్వి అన్నపూర్ణ, ఆనంద్ స్వరూప్, జితేంద్ర నారాయణ్‌ల పై ఎఫ్ఐఆర్ నమోదైంది.