Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగిన ఆర్థిక వ్యయాన్ని సృష్టించలేకపోయాయి
- ఐఐటీల ఆర్థిక నిర్వహణలో లోపాలు : కాగ్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు తగిన అంతర్గత ఆర్థిక వ్యయాన్ని సృష్టించలేకపోయాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఒక నివేదికలో పేర్కొన్నది. గ్రాంట్ల కోసం ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాయని వివరించింది. 2014-19 మధ్య కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల పనితీరు ఆడిట్ ఆధారంగా ఈ నివేదిక తయారైంది. ఐఐటీలలో చేస్తున్న ఆర్థిక నిర్వహణలో లోపాలున్నట్టు ఆడిట్లో తేలిందని నివేదిక పేర్కొన్నది. '' మౌలిక సదుపాయాల కల్పన ఆలస్యమవుతున్నందున మూలధన వ్యయాన్ని సవరించాల్సి వచ్చింది. ఐఐటీలు తగినంత అంతర్గత వ్యయాన్ని సృష్టించలేకపోయాయి. దీంతో గ్రాంట్ల కోసం ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నాయి'' అని నివేదిక వివరించింది.
మాస్టర్ ప్రోగ్రామ్‌ల కోసం ఐఐటీలలో అడ్మిషన్ల కొరత
దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది ఐఐటీలు మాస్టర్స్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్లలో లోటును నమోదు చేశాయని నివేదిక పేర్కొన్నది. ''అకడమిక్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్లు, పరిశోధనలకు సంబంధించి రెండు ఐఐటీలు (భువనేశ్వర్, జోధ్‌పూర్) నిర్దేశిత సంఖ్యలో కోర్సులను ప్రారంభించలేకపోయాయి'' అని నివేదిక పేర్కొన్నది. ఎనిమిది ఐఐటీల్లో ఏ ఒక్కటీ ఆరో సంవత్సరం చివరలో విద్యార్థుల నిర్దేశిత క్యుములేటివ్ ఇన్‌టేక్‌ను సాధించలేకపోయాయని వివరించింది. ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఇండోర్, ఐఐటీ జోధ్‌పూర్, ఐఐటీ మండి, ఐఐటీ పాట్నా, ఐఐటీ రోపడ్ లు పీజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లలో లోటును నివేదించాయని కాగ్ పేర్కొన్నది. '' ఐదు ఐఐటీలు పీహెచ్డీ కోర్సుల నమోదును నిర్ణయించలేదు. మిగిలినవి ఈ కోర్సుల్లో నమోదులో లోటును కలిగి ఉన్నాయి. ఇక ఐఐటీలలో ఫ్యాకల్టీ స్థానాల్లో ఖాళీలు ఉన్నాయి. పైగా, రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న చాలా ఐఐటీల్లో విద్యార్థుల నమోదు చాలా తక్కువగా ఉన్నది'' అని కాగ్ వివరించింది.
అన్ని ఐఐటీలూ ప్రభుత్వేతర వనరుల నుంచి ప్రాయోజిత పరిశోధన ప్రాజెక్టుల కోసం చాలా తక్కువ సంఖ్యలో నిధులు పొందాయని తేలింది. దీంతో అవి పరిశోధన కార్యకలాపాలకు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడుతున్నాయి. మొత్తం ఎనిమిది ఐఐటీలు దాఖలు చేసిన, పొందిన పేటెంట్ల మధ్య విస్తృత అంతరం ఉన్నది. ఐదేండ్ల కాలంలో ఎలాంటి పేటెంట్లూ పొందలేదు. పరిశోధన కార్యకలాపాలు ఫలవంతమైన ఫలితాలను ఇవ్వలేకపోయాయని సూచిస్తున్నాయి. ఐఐటీల్లోని పాలక, పర్యవేక్షణ సంస్థలు వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలేదని ఆడిట్ ప్యానెల్ గుర్తించింది. 2014-19 మధ్య ఐదేండ్ల కాలంలో అన్ని ఐఐటీలలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, సెనేట్, ఫైనాన్స్ కమిటీ, బీడబ్ల్యూసీ నిర్వహించే సమావేశాల సంఖ్య కూడా తగ్గింది. ఇది కాకుండా, నాలుగు ఐఐటీలలో పాలక మండళ్లు సరిగా పనిచేయకపోవడంతో నిర్దిష్టమైన లోపాలూ ఉన్నాయని నివేదిక పేర్కొన్నది.