Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో
- నిరుద్యోగ తాండవం..
- అర్హత పదో తరగతి.. వచ్చింది గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, సివిల్ జడ్జ్ పోస్ట్ అభ్యర్ధులు
భోపాల్ : దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటు పరం చేస్తున్నది. అక్కడ రిజర్వేషన్లు అమలు చేయమంటోంది. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో. 15 పోస్టులకు సుమారు 11వేల మంది యువకులు తరలివచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. గత వారాంతంలో ప్యూన్, డ్రైవర్లు, వాచ్మెన్ పోస్టుల కోసం మధ్యప్రదేశ్ ప్రభుతం ప్రకటననిచ్చింది. ఈ పోస్టుల కోసం కేవలం మధ్యప్రదేశ్ నుంచే కాక పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా యువకులు పోటెత్తారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాసైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరగా, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, ఎంబీఏలతో పాటు సివిల్ జడ్జ్ పోస్టులకు అర్హతలున్న వారు కూడా పోటీపడటం గమనార్హం. తాను సైన్స్ గ్రాడ్యుయేట్‌నని, ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, అయితే పిహెచ్డి చేసిన వారు కూడా ఈ పోస్ట్ కోసం వచ్చారని ఒక అభ్యర్థి తెలిపారు. డ్రైవర్ పోస్ట్ కోసం తాను వచ్చానని మరో అభ్యర్థి జితేంద్ర మౌర్య వెల్లడించారు. జడ్జి పరీక్షల కోసం కూడా ప్రిపేర్ అవుతున్నానని, అయితే పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బులు లేదని అందుకే ఈ ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చా నని జితేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రిక్రూట్ మెంట్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ప్రకటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏడాదిలో లక్ష మందిని రిక్రూట్ మెంట్ చేస్తామని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. ఈ ప్రకటన చేసిన కొద్దిరోజులకే శివరాజ్ సింగ్ చౌహాన్ యూటర్న్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలను కుంటున్నారని, కానీ అది సాధ్యం కాదని ఇది వాస్తవమని అన్నారు.
ఖాళీలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు లక్ష ఉద్యోగాల వరకు ఖాళీలున్నాయి. రాష్ట్రంలోని ఎంప్లారు మెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మొత్తం నిరుద్యోగుల సంఖ్య 32, 57,136. పాఠశాల విద్యాశాఖలో 30,600, హోంశాఖలో 9,388, ఆరోగ్య శాఖలో 8,592, రెవెన్యూ శాఖలో 9,530 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. 17 ఏళ్ల శివరాజ్ ప్రభుత్వ అభివృద్ధి వాస్తవానికి ఎలా ఉందో ఈ ఘటన చూపిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. నెలలో లక్ష పోస్టులను భర్తీ చేయడం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు ఎక్కడు ఉన్నారంటూ ప్రశ్నించారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే గత ఏడాది నిరుద్యోగం కార ణంగా 95 మంది కంటే తక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది. థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం.. నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని నిరుద్యోగిత రేటు 1.7 శాతం మాత్రమే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.