Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడో స్థానంలో హైదరాబాద్ ఐఐటీ : అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా అటల్ ఇన్నోవేషన్ ర్యాకింగ్స్ను ప్రకటించింది. 2021 ఏడాదికి గానూ ప్రకటించిన ఈ జాబితాలో మళ్లీ ఐఐటీ-మద్రాస్ మొదటిస్థానం దక్కించుకోగా, ఐఐటీ హైదరాబాద్ టాప్టెన్లో నిలవడం విశేషం. ఈసారి ఐఐటీ హైదరాబాద్ ఏడో స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ ఈ ర్యాంకులను ప్రకటించారు. వినూత్న సాంకేతిక ఆవిష్కరణల అంశంలో ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్ వరుసగా మొదటి స్థానం దక్కించుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఖరగ్పూర్లు ఉన్నాయి.
19 నుంచి ఏడో స్థానానికి హైదరాబాద్ ఐఐటీ
సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ టాప్టెన్లో చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని అధ్యాపకులు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ 2018లో ఏఆర్ఐఐఏ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఏటా ర్యాంకులను ప్రకటిస్తున్నది. గతేడాది 19వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఇప్పుడు 7వ స్థానం దక్కించుకోవడం విశేషం.