Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) ఉత్తరాఖండ్ రాష్ట్ర కార్యదర్శిగా రాజేంద్ర సింగ్ నేగి తిరిగి ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర ఏడో మహాసభ డెహ్రాడూన్‌లోని జైన ధర్మశాల వీరేంద్ర భండారీ నగర్లో జరిగింది. బలమైన పార్టీని నిర్మించాలని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, రాష్ట్రంలో మతోన్మాద శక్తులను ఓడించాలని సీపీఐ(ఎం) మహాసభ పిలుపునిచ్చింది. తొలుత భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు బచ్చిరామ్ కౌన్స్వాల్ పార్టీ జెండాను ఎగురవేసి మహాసభను ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బహిరంగ సభ, ప్రతినిధుల సభలో ప్రసంగించారు. మోడీ ప్రభుత్వ మతతత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఏచూరి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో హరిద్వార్‌లో ధర్మసంసద్ నిర్వహించడం ద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక స్ఫూర్తిని అవమానించడం, మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తిచేయడం జరిగిందని విమర్శించారు. మహాసభలో 25 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక అయింది.