Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవరాజు మహారాజుకు సాహిత్య అకాడమీ బాల పురస్కారం
- తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం
న్యూఢిల్లీ : తెలుగులో ముగ్గురు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. కవి, రచయిత గోరటి వెంకన్నకు కవిత్వంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కవి, నవతెలంగాణ కాలమిస్టు ప్రొఫెసర్ దేవరాజు మహారాజుకు సాహిత్య అకాడమీ బాల పురస్కారం, కవి తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కాయి. 'పల్లె కన్నీరు పెడుతుందో' అంటూ కుబుసం చిత్రం పాటతో ప్రజాదరణ పొందిన జానపద గాయకుడు, రచయిత , కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2021 దక్కింది. ఆయన వల్లంకితాళం కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. తెలుగు విభాగంలో 12 ఎంట్రీలు రాగా గోరటి వెంకన్నకు వచన కవిత్వానికి అవార్డు వరించింది. డాక్టర్ .సి.మృణాళిని, జి.శ్రీరామమూర్తి, డాక్టర్ కాత్యాని విద్మహేల జ్యూరీ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగంలో గోరటి వెంకన్న వల్లంకితాళాన్ని ఎంపిక చేసింది. గోరటి వెంకన్న తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా గౌరవరం గ్రామానికి చెందిన వారు. కేంద్ర సాహిత్య అకాడమీ 20 భాషల్లో ఏడు కవితా సంపుటిలు, రెండు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒకటి చొప్పున బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, క్రిటిసిజం, ఎపిక్ పొయిట్రీలను 2021 సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల్లోని అవార్డులను త్వరలో ప్రకటిస్తామని అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్, కార్యదర్శి కె.శ్రీనివాసరావులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.లక్ష నగదు, కాపర్ షీల్డ్, శాలువాతో అవార్డు ప్రధానోత్సవం చేయనున్నారు. అలాగే అవార్డు ప్రధానోత్సవం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
దేవరాజు మహారాజుకి సాహిత్య బాల పురస్కారం
కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం-2021 దేవరాజు మహారాజు రచించిన నేను అంటే ఎవరు నాటకానికి దక్కింది. వరంగల్ జిల్లాకు చెందిన దేవరాజు మహారాజు ఉస్మానియా వర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకొని జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సినిమాల విశ్లేషణ, జానపద సాహిత్య పరిశీలన చేసిన దేవరాజు డిగ్రీ స్థాయి పలు పాఠ్యాంశాలు పోటీ పరీక్షల స్థాయిలో తీర్చిదిద్దారు. డాక్టర్ సి.భవాని దేవి, మధురంటకం రవీంద్ర, సీతారామ రావు జ్యూరీ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో దేవరాజు మహారాజు రచించిన నేను అంటే ఎవరు నాటకాన్ని బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. రూ.50 వేలు నగదు, కాపర్ షీల్డ్, శాలువాతో అవార్డు ప్రధానోత్సవం చేయనున్నారు.
తగుళ్ల గోపాల్‌కి యువ సాహిత్య పురస్కారం
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం - 2021కి తగుళ్ల గోపాల్ దండకడియం కవితా సంపుటి ఎంపికైంది. ''ఎక్కడి నుంచో రేగుపండ్ల వాసన.. వచ్చేది మా హంస అక్క అయి ఉంటుంది'' అని తన కవిత్వంలో మంటల్లో చనిపోయిన అక్క హంసమ్మను బతికించుకొనే ప్రయత్నం చేసిన తగుళ్ల గోపాల్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామంలో జన్మించారు. దాట్ల దేవదనంరాజు, ప్రొఫెసర్ కె.ఆశా జ్యోతి, ఖద్రీబాబు జ్యూరీ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో తగుళ్ల గోపాల్ రచించిన దండకడియం కవితా సంపుటిని యువ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. రూ.50 వేలు నగదు, కాపర్ షీల్డ్, శాలువాతో అవార్డు ప్రధానోత్సవం చేయనున్నారు.
సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
కేంద్ర సాహిత్య అవార్డు, పురస్కారాలను పొందిన కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ దేవరాజు మహారాజు, కవి తగుల్ల గోపాల్‌కు సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సాహిత్యానికి సంబంధించిన మూడు విభాగాల్లోనూ తెలంగాణ బిడ్డలకు అవార్డులు లభించడంతో తెలంగాణ సాహితీ గరిమను మరోసారి ప్రపంచానికి చాటినట్టయిందని పేర్కొన్నారు. బాల సాహిత్య పురస్కారం విభాగంలో 'నేను అంటే ఎవరు?' అనే నాటక రచనకు దేవరాజు మహారాజు పురస్కారం పొందటం గర్వకారణంగా ఉందని తెలిపారు. యువ పురస్కారం' విభాగం కింద 'దండ కడియం' సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన తగుల్ల గోపాల్ సాహిత్యంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రముఖ కవి, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న 'వల్లంకి తాళం'అనే కవితా సంపుటికి ప్రతిష్టాత్మక 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2021 దక్కటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.