Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని విశ్వవిద్యాలయాలను జైళ్లుగా మార్చే ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి విపి సాను, మయూక్ బిశ్వాస్ డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల గొంతె నొక్కేందుకు మోడీ సర్కార్ అవలంబిస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రతిఘటించాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, కురుక్షేత్ర, విశ్వ భారతి యూనివర్సిటీల్లో తమ సమస్యలపై ఆందోళన చేసినందుకు అమానుషంగా శిక్షకు గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేయడం నేరం కాదనీ, అది తమ ప్రజాస్వామ్యక హక్కు అని స్పష్టం చేశారు. గురువారం నాడిక్కడ ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్, ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి దీప్సితా ధర్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు పరిచరు యాదవ్, జేఎన్ యూ ఎస్ యు అధ్యక్షరాలు ఐషీ ఘోష్, ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు నితీష్ నారాయన్ మాట్లాడారు.
తొలుత ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ మాట్లాడుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరంకుశ చర్యలను ప్రశ్నించకుండా విద్యార్థులను బెదిరించడం దీని ఉద్దేశమని అన్నారు. కరోనా లాక్డౌన్ కాలంలో కూడా సీఏఏ, ఎన్నార్సీ కి వ్యతిరేకంగా నిరసన, ఫీజు పెంపుదలకు వ్యతిరేకంగా పోరాటాలు వంటి ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన హక్కును వినియోగించుకున్నందుకు అనేక మంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని శిక్షించారని విమర్శించారు. విద్యార్థుల భావప్రకటనా స్వేచ్ఛను హరించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లు ఇప్పటికే క్యాంపస్ లోపల అనేక ఆంక్షలు విధించేందుకు కరోనా మహమ్మారిని ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. డిజిటల్ విభజన, పెరుగుతున్న డ్రాపౌట్ రేటు, విద్యార్థుల ఆత్మహత్యల వంటి భయంకరమైన నివేదికల తీవ్రమైన ఆందోళనలు ఉన్నప్పటికీ, క్యాంపస్‌ను తిరిగి తెరవడంలో ఉద్దేశపూర్వక జాప్యం విద్యార్థుల సామూహిక గొంతులను నిరోధించే మరొక మార్గమని పేర్కొన్నారు. లైబ్రరీలు, లేబొరేటరీలు మొదలైన సౌకర్యాలను తిరస్కరించినప్పటికీ, చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులను వసూలు చేస్తున్నాయని విమర్శించారు.
విద్యా రంగాన్ని వాణిజ్యకరించడం ద్వారా, లాభాల పంట కోసం ప్రయివేట్ వ్యక్తుల నుంచి పెట్టుబడిని తీసుకురావడం ద్వారా విద్య నయా-ఉదారవాద ఎజెండాను తీర్చడానికి నూతన విద్యా విధానం రూపొందించబడిందని విమర్శించారు. నూతన విద్య విధానాన్ని దాని ప్రతిపాదిత నిర్మాణంలో అమలు చేయడం వలన, అట్టడుగు వర్గాలకు విద్య అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా, ప్రతిఘటన స్వరాన్ని అణచివేసే అధికారాన్ని అధికారులకు అందిస్తుందని తెలిపారు.
ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి దీప్సితా ధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే బదులు వారి ప్రజాస్వామ్య గొంతులను అణచివేసేందుకు పాండిచ్చేరి యూనివర్సిటీ ఘటనే అందుకు నిదర్శనం అని అన్నారు.పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు పరిచరు యాదవ్ మాట్లాడుతూ తమ యూనివర్శిటీలో విపరీతమైన ఫీజు పెంపు చర్యకు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో విద్యార్థులతో ఎన్నుకోబడిన స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించిన శాంతియుత, ప్రజాస్వామ్య ఆందోళనలో పాల్గొన్నందుకు 11 మంది విద్యార్థులను డిబార్ చేస్తూ వర్సిటీ అడ్మిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని విమర్శించారు.
ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు నితీష్ నారాయన్ మాట్లాడుతూ అన్యాయంగా శిక్షకు గురైన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. పాండిచ్చేరి యూనివర్శిటీ, కురుక్షేత్ర యూనివర్శిటీ సహా వివిధ క్యాంపస్‌లలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను డిబార్ చేసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని అన్ని ప్రజాతంత్ర శక్తులు, వ్యక్తులకు ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు.