Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ నగరాల్లో కోటీ 50లక్షల మంది కార్మికులు
- 16గంటలు.. 20గంటలు పని
- ఫలితం శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు
- కనీస వేతనం, ఉద్యోగ భద్రత శూన్యం
- లేబర్ కోడ్లు కంపెనీ కోసమా? కార్మికుల కోసమా?
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ, కొరియర్ డెలివరీ, క్యాబ్ డెలివరీ..ఇలా పేరేదైనా వారి వృత్తి కంపెనీ సేవల్ని వినియోగదారుడి ఇంటివద్దకు చేర్చాలి. వీరిని 'గిగా వర్కర్స్'గా పిలుస్తున్నాం. కోటీ 50లక్షల మంది పనిచేస్తున్న ఈ రంగం గురించి ఆలోచించే నాథుడే లేడు. 16 గంటలు..18 గంటలు పనిచేయించుకున్నా ఇదేమని అడగడానికి వీలుగాని పరిస్థితి. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం మానసికంగా, శారీరకంగా రాజీపడుతూ కార్మికులు పనిచేయాల్సి వస్తోంది. దీనిని ఆయా కంపెనీలు(ఆమోజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, ఓలా..మొదలైనవి) అవకాశంగా మలుచుకున్నాయి.
మనదేశంలోని గిగా వర్కర్స్ పని పరిస్థితుల గురించి 2019లో 'ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్'(ఐఎఫ్ఏటీ), ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) అధ్యయనం చేసింది. గిగా వర్కర్స్ పని పరిస్థితులు, కంపెనీల దోపిడిని తెలియజేస్తూ 'ఐఎఫ్ఏటీ' సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కార్మికచట్టాల్లో పేర్కొన్న విధంగా వీరికి నిబంధనలు వర్తింపజేయాలని, ప్రభుత్వం ద్వారా సామాజిక, సంక్షేమ పథకాలు అమలు అయ్యేట్టు చూడాలని పిటిషన్లో కోరారు. సంస్కరణల పేరుతో గొప్ప గొప్ప చట్టాలు చేసే కేంద్రం కార్మికుల సంక్షేమంపై ఎందుకు ఆలోచించటం లేదని ఐఎఫ్ఏటీ ప్రశ్నిస్తోంది.
మోడీ సర్కార్‌లో స్పందన కరువు
ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ దేశాల్లో 'గిగా వర్కర్ల'ను కార్మికులుగా వర్గీకరించారు. వారికి సామాజిక భద్రతా, ప్రయోజనాల్లో ప్రాధాన్యత కల్పించారు. ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 14నాటికి పోర్టల్‌లో మొత్తం 7,27,921 మంది గిగ్ వర్కర్లుగా నమోదుచేసుకున్నారు. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రతిపక్షాలు, సుప్రీంకోర్టు పదే పదే కోరిన తర్వాత మోడీ సర్కార్‌లో కదలిక వచ్చింది. ఈ-శ్రమ్ పోర్టల్ ఏర్పాటయ్యాక..వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు తమ వివరాల్ని పెద్ద సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారు. వైద్య, జీవిత బీమా, అంగవైకల్యం, వృద్ధాప్య రక్షణ, విద్యాభత్యం, ప్రసూతి ప్రయోజనాలు..మొదలైనవాటిపై రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల్లో లబ్దిదారులుగా చేరడానికి ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కొంతవరకు దోహదపడుతుందని గిగ్ వర్కర్లకు భావిస్తున్నారు.
ఆరోగ్య సమస్య వస్తే!
ఐఎఫ్ఏటీ, ఐటీఎఫ్ సంయుక్త అధ్యయనంలో కార్మికులు వెలుబుచ్చిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక క్యాబ్ డ్రైవర్ ఒక రోజులో సగటున 16-20 గంటలు డ్రైవింగ్ చేస్తున్నాడు. తాము 20 గంటలు కారు నడుపుతున్నామని 40శాతం మంది డ్రైవర్లు చెప్పారు. ఇలా 20గంటలు పనిచేస్తున్న డ్రైవర్లు బెంగుళూర్, చెన్నై, హైదరాబాద్‌లలో 73శాతం మంది ఉన్నారు. ఈ విధమైన పని పరిస్థితుల కారణంగా డ్రైవర్లంతా తీవ్రమైన అనారోగ్య సమస్యలబారిన పడుతున్నారు. నడుము నొప్పి, లివర్ సమస్యలు, మెడ, కండరాల నొప్పి..అనేవి గిగా వర్కర్స్‌లో 60.7శాతం మందిలో ఉన్నాయి. ఇలా ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చినా, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా తమను ఆదుకునేందుకు వైద్య బీమా లేదని, అరకొర జీతంతో అనారోగ్య సమస్యలపై ఖర్చు చేయలేకపోతున్నామని 96శాతం మంది డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయమనేది ఉందా?
స్విగ్గీ, జొమాటో..తదితర యాప్‌లలో ఫుడ్ డెలివరీ చేసేవాళ్లు నగరాల్లో రాత్రిపగలు పనిచేయటం అందరమూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు 11యాప్‌లు ఫుడ్ డెలివరీ సేవల్ని అందిస్తున్నాయి. ఇందుకోసంగాను నియమించుకుంటున్న వారికి న్యాయమైన వేతనం, పనిపరిస్థితులు, కాంట్రాక్ట్ ఒప్పందం, మేనేజ్మేంట్..దొరకటం లేదు. గిగా వర్కర్స్ వారంలో ఏడు రోజులు పనిచేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన 'టిస్' అనే సంస్థ తన సర్వేలో పేర్కొన్నది. 47శాతం మంది కార్మికులు రోజులో 12గంటలు పనిచేస్తున్నారని, 18 శాతం కార్మికులు రోజులో 15గంటలు దాటి పనిచేస్తున్నారని సర్వేలో తేలింది. ఆయా కంపెనీలు కార్మికులకు ఓవర్‌టైమ్ (ఓటీ) ఇవ్వకుండానే పనిచేయించుకుంటున్నాయి. కరోనా మొదటివేవ్, రెండో వేవ్ సమయంలో ఎంతోమంది కార్మికులు కోవిడ్‌బారినపడి హాస్పిటల్ పాలయ్యారు. దాచుకున్న కొద్దిపాటి సొమ్ము, ఇతరుల నుంచి అప్పులు చేసి వైద్యచికిత్స పొందాల్సి వచ్చింది.