Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని పార్టీలూ అనుకూలం
- కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తాం : సీఈసీ సుశీల్ చంద్ర
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. గురువారం లక్నోలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల ను నిర్వహించడంలో ఎలాంటి ఆలస్యమూ ఉం డదన్నారు. కోవిడ్-19 అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమతో కలిసి చెప్పినట్టు ఆయన వివరించారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, అంగ వైకల్యం కలిగి ఉన్నవారు, కోవిడ్ బారిన పడినవారు ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. కాగా, రాష్ట్రంలో తక్కువ ఓటింగ్ శాతం ఆందోళనకరంగా ఉన్నదని సీఈసీ సుశీల్ చంద్ర అన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 61శాతం, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 59 శాతమే ఓటింగ్ శాతం నమోదైందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తుది ఓటరు జాబితాను జనవరి 5న విడుదల చేయనున్నట్టు చెప్పారు. మరోసారి కోవిడ్-19 విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో యూపీలో రాజకీయ పార్టీల భారీ ర్యాలీలపై ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శితో చర్చించినట్టు తెలిపారు. కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్ సమయాన్ని పోల్ ప్యానెల్ ఒక గంటపాటు పెంచినట్టు సీఈసీ వివరించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న యూపీ తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆరంభం లో జరగాల్సి ఉన్నది. అయితే, దేశంలో ఓమిక్రాన్ విజృంభి స్తుండటంతో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుతా యా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలి గాయి. ఈ నేపథ్యంలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఈసీ స్పష్టతనివ్వడం గమనార్హం.
రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి ఈసీ బృందం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ బృందం మంగళవారం యూపీకి చేరుకున్నది. మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికలు సజావుగా సాగడం కోసం చేసిన ఏర్పాట్ల విషయంలో బుధవారం సమీక్షను నిర్వహించింది. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేటులను, పోలీసు అధికారులను, ఐజీలు, డీఐజీలు, ఇతర అధికారులను ఈసీ బృందం కలిసింది. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్నీ నిర్వహించింది.
యూపీ కొత్త సీఎస్‌గా దుర్గా శంకర్ మిశ్రా
యూపీ నూతన చీఫ్ సెక్రెటరి (సీఎస్)గా నియమితులైన దుర్గా శంకర్ మిశ్రా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. మిశ్రా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. వాస్తవానికి డిసెంబర్ 31న (నేడు) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నది.