Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు భారీ నియామక పరీక్షలతో ఖజానాకు 900 కోట్లు
- రాష్ట్రాల్లోనూ అదే తీరు
- 2021లో ఎనిమిది రాష్ట్రాల్లో 25 పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ : దేశంలోని నిరుద్యోగుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఆటలాడుకుంటున్నాయి. నియామకాల పరీక్షల పేరుతో వారి నుంచి డబ్బులు దండుకుంటున్నాయి. కానీ, పరీక్షల నిర్వహణలో మాత్రం పక డ్బందీ చర్యలు చేపట్టడం లేదు. దీంతో పేపర్ లీకేజీ వంటి పలు కారణా లతో పలు పరీక్షలు రద్దవుతున్నాయి. ఫలితంగా సర్కారు ఉద్యోగంపై గంపెడు ఆశలు పెట్టుకొని పరీక్షలకు సమాయత్తమవుతున్న యువతీ, యువకులకు ప్రభుత్వాల తీరు శాపంగా మారుతున్నది. పేపర్ లీక్ కావడం వంటి అవకతవకలు, కరోనా మహామ్మారి వంటి పరిస్థితులతో పరీక్షలు రద్దవుతున్నాయి. ''నవంబర్ 23న యూపీ టెట్ పరీక్షకు నేను హాజరు కావాల్సి ఉన్నది.
అయితే పేపర్ లీక్ అయిందని తెలిసింది. దీంతో నేను వారం రోజుల పాటు బాధపడ్డాను'' అని బీహెచ్‌యూలో బీఈడీ పూర్తి చేసిన ధీరజ్ సింగ్ వాపోయాడు. ఇలాంటి చర్యలతో వయసు, డబ్బు, కలలు ప్రతిదీ ప్రమాదంలో పడుతుందన్నారు. అలాగే, హర్యానాకు చెందిన పరాగ్ పరిస్థితీ ఇదేవిధంగా ఉన్న ది. హర్యానా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం పరాగ్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అయితే, ఆగస్టు 8న పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా ఇంతలోనే పేపర్ లీకై ఎగ్జామ్ రద్దయ్యిందన్న వార్త తెలిసింది. దీంతో తాను చాలా మనోవేదనను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాడు. భారతదేశంలోని లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. దేశంలోని అవినీతి పాలనా వ్యవస్థతో ఈ నిరుద్యోగ యువత కలలు చెల్లాచెదురవుతున్నాయి. కేవలం హర్యానా, యూపీ మాత్రమే కాదు.. పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రిగ్గింగ్ కారణంగా 2021లో ఈ రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షలు రద్దవడం, వాయిదా పడటం వంటివి జరిగాయి. ఇక కేంద్రం తీరు కూడా ఇదే విధంగా ఉన్నది. మూడేండ్లు దాటినా లక్షలాది గ్రూప్ డీ పోస్టులకు సెంట్రల్ రైల్వే పరీక్షలు నిర్వహించలేదు. అయితే, పరీక్షల రద్దు, వాయిదాతో యువతీ, యువకులు తీవ్రంగా బాధలను అనుభవిస్తున్నారు. కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం నిరుద్యోగులు చెల్లించిన పరీక్షల ఫీజులతో సోమ్ము చేసుకుంటున్నాయి.
యూపీలోని పరిస్థితి
యూపీ ఎస్ఐ పరీక్షలో రిగ్గింగ్ జరిగిందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఈనెల 16న సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్‌గా మారింది. యూపీఎస్‌ఐ2021స్కాం అనే హ్యాష్ ట్యాగ్‌ను దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా ట్వీట్ చేశారు.పరీక్షను రద్దు చేయాలని యువత కోరింది.
టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష యూపీటెట్ 2021
పరీక్ష తేదీ : 23 నవంబర్ 2021
ప్రస్తుత స్థితి : పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దయ్యింది. దీంతో పరీక్షను వచ్చే జనవరి 23న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు 12 లక్షల మందిపై దీని ప్రభావం పడింది. ఈ పరీక్షకు అభ్యర్థులు దాదాపు రూ. 400 నుంచి 600 వరకు చెల్లించారు.
యూపీ పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ : ఏప్రిల్ 01, 2021. మొత్తం పోస్టులు : 9534
ప్రస్తుత స్థితి : ఈ పరీక్షకు సంబంధించి హ్యాకింగ్ గ్యాంగ్‌ను మీరట్-అలీగఢ్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ విషయం కోర్టుకు చేరింది.
యూపీ లేఖ్పాల్ పరీక్ష : జూలై 2019
స్థితి : పరీక్ష రద్దయ్యింది. దీంతో 2021లో మళ్లీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నవంబర్‌లో జరిగే ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేశారు. అయితే, నోటిఫికేషన్‌ను మళ్లీ విడుదల చేస్తారని సమాచారం.
రాజస్థాన్‌లో..
ఇక రాజస్థాన్‌లో ఆర్ఈఈటీ (రాజస్థాన్ ఉపాధ్యాయుల అర్హత పరీక్ష) సహా అనేక రిక్రూట్మెంట్ పరీక్షలు వివాదంలో ఉన్నాయి.
ఆర్ఈఈటీ
ఈ పరీక్షను 25-27 సెప్టెంబర్ 2021 లో నిర్వహించాల్సి ఉన్నది. అయితే, హ్యాకింగ్ ఆరోపణలతో ఇది రద్దయ్యింది. ఇందులో ఉన్న మొత్తం పోస్టులు 31. ఈ పరీక్షకు అభ్యర్థులు రూ. 500 నుంచి 700 వరకు దరఖాస్తు ఫీజును చెల్లించారు. దాదాపు 16.51 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు.
పట్వారీ నియామక పరీక్ష, 2021
ఈ పరీక్ష ఈ ఏడాది 23-24 తేదీల్లో జరగాల్సింది. అయితే, పరీక్షల్లో డమ్మీ అభ్యర్థులను ఏర్పాటు చేసిన విషయంలో 50 మంది అరెస్టయ్యారు. ఈ పరీక్షకు 15.62 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రీ-ప్రైమరీ టీచర్
ఈ పరీక్ష 2019లో ఫిబ్రవరి 24న జరిగింది. ఆరువేల పోస్టులకు పరీక్షను నిర్వహించారు. 24వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ. 250 నుంచి 400 వరకు ఈ పరీక్షకు ఫీజును చెల్లించారు.
హర్యానాలో అనేకం
ఈనెల 25న జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ హర్యానా గుడ్ గవర్నెన్స్ మోడల్‌ను కొనియాడారు. హర్యానా నుంచి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలని కూడా పిలుపునిచ్చారు.
గుజరాత్లో.. అనేక పరీక్షలు తీవ్ర వివాదాలతో రద్దయ్యాయి. హెడ్ క్లర్క్ పరీక్ష డిసెంబర్ 12న జరగాల్సింది. అయితే, పరీక్షకు ముందు లీకేజీ వార్తలు రావడంతో ప్రభుత్వం ఆ పరీక్షలను రద్దు చేసింది. మొత్తం 186 పోస్టులకు గానూ 2.41 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి చెల్లించిన ఫీజు రూ. 115. ప్రభుత్వానికి వచ్చి చేరిన ఆదాయం రూ. 27.71 కోట్లు.
జీసెట్ రిక్రూట్మెంట్ 2021
అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం ఈ పరీక్షను డిసెంబర్ 26 నిర్వహించాల్సి ఉన్నది. అయితే, ఈ పరీక్ష మాత్రం రద్దయ్యింది. పరీక్షను తిరిగి వచ్చే నెల 23న నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు ఒక్కో అభ్యర్థి రూ. 100నుంచి రూ. 900 చొప్పున చెల్లించారు.
మహారాష్ట్రలో..
మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో గ్రూప్‌సీ, డీ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్ 30న పరీక్షను నిర్వహించ తలపెట్టారు. మొత్తం ఉన్న పోస్టులు 4618. అయితే, పేపర్ లీక్ ఆరోపణలతో ఈ పరీక్ష రద్దయ్యింది. అలాగే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దాదాపు పది లక్షల పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది నవంబర్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే, పేపర్ లీక్‌తో ఈ పరీక్ష కూడా రద్దయ్యింది. మహారాష్ట్ర గృహ ప్రాంతాభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఏడీఏ) డిసెంబర్లో నిర్వహించిన నియామక పరీక్షకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయ్యింది.
బీహార్‌లో..
రెవెన్యూ విభాగంలో 1767 పోస్టులకు గానూ నిర్వహించ తలపెట్టిన పరీక్షను తప్పుడు ప్రమాణాల కారణంగా హైకోర్టు రద్దు చేసింది. ఇక బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (బీఎస్ఎస్సీ) పరీక్షకు 2014లో నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 13వేల పోస్టులకు గానూ 18.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రూ. 200 నుంచి 750 వరకు ఫీజును చెల్లించారు.
మధ్యప్రదేశ్‌లో
సీనియర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎస్ఏడీఓ) పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 10న జరగాల్సింది. ఇందులో ఉన్నవి మొత్తం 863 పోస్టులు. ఇందుకు రూ. 250 నుంచి రూ. 500 చొప్పున అభ్యర్థులు ఫీజును చెల్లించారు. ఇక మొత్తం 20 పోస్టులకు గానూ ఎస్ఈడీసీ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాల్సింది. ఇది కూడా పేపర్ లీకేజీతో రద్దయ్యింది. మొత్తం 5215 స్టాఫ్ నర్సు పోస్టుల కోసం నియామక ప్రక్రియల అక్టోబర్ 10, 2020 నుంచి ప్రారంభమైంది. పేపర్ లీక్ ఈ నియామక ప్రక్రియకు బ్రేకులు వేసింది.
పంజాబ్‌లో..
పంజాబ్‌లో పేపర్ లీకేజీ కారణంగా ఈ ఏడాది రెండు పరీక్షలు అవకతవకల కారణంగా రద్దయ్యాయి. 560 పోస్టులకు ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్ష ఈ ఏడాది ఆగస్టులో 17 నుంచి 24 తేదీల మధ్య జరగాల్సిన పరీక్ష క్యాన్సలైంది. అలాగే, 2364 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది నవంబర్ 28న జరగాల్సిన పంజాబ్ ప్రీ ప్రైమరీ టీచర్ పరీక్ష రద్దయ్యింది. ఇక కరోనా సాకుతో ఆయా రాష్ట్రాల్లో పలు నియామక పరీక్షలు రద్దయ్యాయి.భద్రతా ప్రమాణాలు కారణాలుగా చూపుతూ ప్రభుత్వాలు పరీక్షలను నిలుపుదల చేశాయి. కానీ,ఇదే సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు మాత్రం జరగటం గమనార్హం.