Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం నియోజకవర్గంలోనూ షాక్
- కాంగ్రెస్కు 501 వార్డులు
- కర్నాటక 'స్థానిక' ఎన్నికల ఫలితాలు
బెంగళూరు : కర్నాటకలో అధికార బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) ఎన్నికల్లో ఓటర్లు కాషాయపార్టీకి షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ చక్కటి ప్రదర్శనను కనబర్చింది. కర్నాటకలో 20 జిల్లాల్లో 58 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. మొత్తం 1184 వార్డులకు గానూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 501 స్థానాలను గెలుచుకున్నది. అధికార బీజేపీ మాత్రం 433 సీట్లకు పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఇక జనతా దళ్ (సెక్యూలర్) 45 వార్డుల్లో విజయం సాధించింది. స్వతంత్రులు, చిన్న పార్టీల అభ్యర్థులు 205 సీట్లలో విజయం సాధించారు.
సొంత నియోజకవర్గంలో సీఎంకు చేదు ఫలితాలు
రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై సొంత నియోజకవర్గమైన శిగ్గాన్లో బంకాపూర్ పట్టణ మునిసిపల్ కౌన్సిల్, గుత్తల్ టౌన్ పంచాయత్ లను కాంగ్రెస్ నిలబెట్టుకున్నది. ఇక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బి. శ్రీరాములు సొంత పట్టణ నాయకనహట్టిలో అధికార పార్టీ ఓడిపోయింది. అలాగే, పలువురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ బీజేపీకి ఇలాంటి ఫలితాలే ఎదురుకావడం గమనార్హం. కాగా, మొత్తం ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే బీజేపీ గత ఎన్నికల కంటే చక్కటి ప్రదర్శనను కనబర్చిందని సీఎం తెలిపారు. మైనారిటీల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓడిపోయినట్టు ఆయన చెప్పారు. కాగా, ఈ ఫలితాలు బీజేపీ 'నిస్సహాయ పాలన'కు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్కు బలమైన సానుకూల పవనాలు వీస్తున్నాయని ఈ ఫలితాలు నిరూపించాయని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు 2023లోరాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి హెచ్చరిక అనీ, ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సీఎం మార్పుపై ఇటీవల ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురుకావడం గమనార్హం.