Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమాన్ని అడ్డుకునేందుకు 'ట్విట్టర్'పై కేంద్రం కక్షసాధింపు
- ట్విట్టర్ కార్యాలయాలపై పోలీసు దాడులు
- కొత్త ఐటీ చట్టంతో సోషల్‌మీడియాను నియంత్రించేందుకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా సంక్షోభం, దానితో ముడిపడిన ఆర్థిక సమస్యలు 2021 ఏడాదంతా ఈ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. వీటిని పరిష్కరించలేక మోడీ సర్కార్ రకరకాల పద్ధతుల్లో కాలం వెళ్లదీస్తూ వస్తోంది. దేశంలోని ప్రధాన మీడియాను చెప్పుచేతుల్లో పెట్టుకుంది. కరోనా, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం..వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రకరకాల వార్తా కథనాల్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఇక సోషల్ మీడియా(ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్..)ను కూడా పూర్తిగా నియంత్రించేందుకు మోడీ సర్కార్ కొత్త ఐటీ చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో నిబంధనలు డిజిటల్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ న్యూస్ కంటెంట్‌కు వర్తించేలా పలు నిబంధనల్ని రూపొందించింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఢిల్లీ శివార్లలో రైతు ఉద్యమం ఉవ్వెత్తున సాగిన తీరు కేంద్రంలో పాలకులకు ముచ్చెమటలు పట్టించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో మోడీ సర్కార్‌పై ఆగ్రహం పెల్లుబుకింది. దాంతో సోషల్ మీడియాను తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు కేంద్రం రకరకాల ఎత్తుగడలను ప్రయోగించింది. తప్పుడు సమాచారాన్ని తొలగించాలన్న ఆరోపణతో ట్విట్టర్‌కు పదే పదే నోటీసులు జారీచేసింది. ఢిల్లీ ట్విట్టర్ కార్యాలయాల్లోకి ఢిల్లీ పోలీసులు వెళ్లి అక్కడి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. జూన్‌లో ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ పతాక స్థాయికి చేరింది.
స్వేచ్ఛాయుత ఇంటర్నెట్, డిజిటల్ కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ట్విట్టర్ అధికార ప్రతినిధి మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. నిరసనలు, ఆందోళనలు వ్యాప్తిం చెందడానికి కారణమవుతున్న ఖాతాలపైనా ట్విట్టర్ చర్యలకు దిగింది. వాటిని అడ్డుకునేందుకు ప్రత్యేక సాంకేతికతను తీసుకొస్తున్నామని భారత ప్రభుత్వానికి తెలియజేసింది. వీటిపై కేంద్రం సంతృప్తి చెందకపోవటంతో, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సే తన పదవి నుంచి తప్పుకొని పరాగ్ అగర్వాల్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించాడు. భారత్‌లో గూగుల్ కూడా కేంద్రం ప్రభుత్వం నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొన్నది. టెక్ దిగ్గజం గూగుల్ 'అక్రమ వాణిజ్య పద్ధతుల్లో' వెళ్తోందన్న దానిపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విచారణకు దిగింది.
ఈ ఏడాది వాట్సాప్ అనేక సమస్యల్లో చిక్కుకుంది. ఖాతాదార్ల గోప్యతా విధానాన్ని అప్డేట్ చేయటం వివాదానికి దారితీసింది. వాట్సాప్ వినియోగదారుల వ్యక్యిగత సమాచారాన్ని తమ భాగస్వాములతో పంచుకుంటామని ఫేస్బుక్ తెలపటం భారత్‌లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం భారత్‌లో వాట్సాప్‌ను 53కోట్లమంది ఖాతాదార్లున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో గోప్యతా విధానంపై ఫేస్బుక్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ఐటీ చట్టం గోప్యతా హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నది.