Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం
- సూరత్ టెక్స్టైల్ ట్రేడర్స్ ఆందోళన
- జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన కేంద్రం
సూరత్ : వస్త్రపరిశ్రమపై జీఎస్టీని పెంచాలన్న కేంద్రం నిర్ణయంపై మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వస్త్ర పరిశ్రమకు పేరు గాంచిన సూరత్‌లోని వస్త్రవ్యాపారులు కేంద్రం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు నెల పాటుగా నిరనలు చేస్తున్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో వారి ఆందోళనలు జరిగాయి. గురువారం సైతం దుకాణాలను మూసివేసి పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేశారు. వస్త్ర పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జీఎస్టీని 12 శాతం వరకు పెంచాలనీ, జనవరి 1 నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని మోడీ సర్కారు యోచించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ పాలిత గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయా రాష్ట్రాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించాల్సి వచ్చింది.అయితే, కేంద్రం ప్రస్తుత వాయిదా నిర్ణయం వస్త్ర పరిశ్రమకు తాత్కాలికంగా ఊరట కలిగించినప్పటికీ.. జీఎస్టీ పెంపు ఆలోచనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని వస్త్ర వ్యాపారాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన తర్వాత జీఎస్టీతో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురైందనీ, ఆ తర్వాత నోట్ల రద్దు, మహమ్మారి పరిస్థితులతో అది మరింత తీవ్రమైందని వ్యాపారులు వాపోయారు. ఇప్పుడున్న ఐదు శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచితే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. జీఎస్టీ పెంపుపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఫెడరేషన్ ఆఫ్ సూరత్ టెక్స్టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎఫ్ఓఎస్టీటీఏ) గురువారం సూరత్‌లో బంద్‌ను చేపట్టింది. దీంతో సూరత్‌లోని 165 ట్రేడింగ్ మార్కెట్లలో 65వేలకు పైగా వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. ప్లేట్లను వాయిస్తూ ఆందోళనాకారులు తమ నిరసనను తెలిపారు. కాగా, గుజరాత్ చేనేత కార్మికుల సంఘం (ఎఫ్ఓజీడబ్ల్యూఏ) రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన నిరసనలు, బంద్‌లకు సంబంధించి ప్రణాళికను ఇప్పటికే ప్రకటించింది. జనవరి 1న పవర్ లూమ్‌లో బంద్, జనవరి 2 నుంచి 5 వరకు నూలు వడకడం, అమ్మకం, కొనుగోలు వంటివి ఆపేయడం వంటివి ఉన్నాయి. ఇక దేశవ్యాప్త నిరసనకు దిగే విషయంలో ఈనెల 11, 12 తేదీల్లో కాన్పూర్‌లో సమావేశం కావాలని ఎఫ్ఓజీడబ్ల్యూఏ, ఎఫ్ఓఎస్టీటీఏ, కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ)లు నిర్ణయించాయి. జీఎస్టీ పెంపు వద్దని పేర్కొంటూ సూరత్‌లోని వస్త్ర వ్యాపార పరిశ్రమకు చెందిన యువత నిర్మలా సీతారామన్‌కు ఇప్పటికే 5000 పోస్టు కార్డులను కూడా పంపారు. అయితే, ఇంతలోనే కేంద్రం జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విషయంలో కేంద్రం ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని వస్త్రవ్యాపారులు మోడీ సర్కారును హెచ్చరించారు.