Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత వస్త్రాలపై పెంపును వ్యతిరేకించిన రాష్ట్రాలు
- టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ యథాతథం
- 46వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
న్యూఢిల్లీ: చేనేత వస్త్రాలపై పన్నులు పెంచే విషయంలో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జీఎస్టీ పెంపు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశం నలుమూలల నుంచి ఆందోళనలు వెల్లువెత్తడం, విమర్శలు రావడంతో మోడీ సర్కార్ పునరాలోచనలో పడింది. దీంతో చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే విషయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. శుక్రవారం నాడిక్కడ స్థానిక విజ్ఞాన భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులందరూ టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పెంచడం సరికాదంటూ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు జీఎస్టీ పెంపుపై విమర్శలు ఎక్కు పెట్టాయి. దీంతో టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సమావేశ అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
టెక్స్టైల్స్ జీఎస్టీ యథాతథం
సెప్టెంబరు 17న జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సిఫారసు చేసిన టెక్స్టైల్స్ ధరల మార్పు నిర్ణయాన్ని వాయిదా వేయాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసినట్టు కేంద్ర నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టెక్స్‌టైల్స్‌పై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటు యథాతథంగానే ఉంచాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీ యథాప్రకారం కొనసాగుతుందనీ, 12 శాతానికి పెరగడం లేదని చెప్పారు. టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ రేటు అంశాన్ని టాక్స్ రేట్ రేషనలైజేషన్ కమి టీకి పంపనున్నామని,ఫిబ్రవరిలో కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆమె చెప్పారు. తత్ఫలితంగా, టెక్స్ట ైల్ రంగంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లు1 జనవరి 2022తరువాత కూడా కొనసాగుతాయని తెలిపారు.
అది బీజేపీ సొమ్మేమీ కాదు
పెర్ఫ్‌ఫ్యూమ్ తయారీదారు పుష్పరాజ్ జైన్‌పై యూపీలో ఐటీ అధికారులు జరిపిన దాడిని సకాలంలో జరిగిన దాడులుగా నిర్మలా సీతారామన్ అన్నారు. అది బీజేపీ సొమ్ము కాదని చెప్పారు. ఐటీ చర్యను యాక్షనబుల్ ఇంటెలిజెన్స్‌గా ఆమె పేర్కొన్నారు. ఐటీ దాడులు సరైన ప్రదేశంలో, సరైన సమయంలోనే జరిగాయన్నారు. ఆదాయం పన్ను శాఖ ప్రొఫనలిజంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అనుమానాలు వ్యక్తం చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సూటిగా స్పందించారు. ఈ దాడులు ఆయనకు వణుకుపుట్టిస్తున్నాయా? భయపడుతున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు పెద్ద ఎత్తున మేట వేసుకున్నట్టు కనిపించడం చూస్తే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎంత నిజాయి తీగా పని చేస్తున్నాయో అర్ధమవుతుందన్నా రు.ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆగి, ముహూర్తం చూసుకుని మరీ దొంగను పట్టుకోవాలంటారా? ఇప్పటికిప్పుడే పట్టుకోవాలంటారా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
రాష్ట్రాల డిమాండ్లు
చేనేతతో పాటు ఫుట్ వేర్ (చెప్పులు), ఇతర అనేక సామాన్యులు వాడే వస్తువులపై జీఎస్టీ పెంపు విషయంలో కేరళతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీశాయి. రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ పరిహారం మరికొంత కాలం పొడిగించాలని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. కేరళ, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఐదేండ్ల పాటు జీఎస్టీ పొడిగించాలని డిమాండ్ చేశాయి. అలాగే తమిళనాడు రెండేండ్ల పాటు పరిహారం పొడిగించాలని డిమాండ్ చేశాయి. అలాగే కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ రూ.1,000 లోపు ఫుట్ వేర్ (చెప్పులు)పై 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ పనులపై 12 నుంచి 18 శాతానికి జీఎస్టీ పెంచడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. అయితే రాష్ట్రాల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం కొన్నిసార్లు వెనక్కి తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది.
ఐటీ చెల్లింపులకు గడువు పొడిగించం : కేంద్రం
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు గడువును పెంచాలనే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఐటీఆర్ దాఖలుకు గడువు 2021 డిసెంబర్ 31తో ముగియనుందన్నారు. ఇదే విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పునరుద్గాటించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు సజావుగా దాఖలు అవుతున్నాయన్నారు. ఈ సంవత్సరం గతం కన్నా 60 లక్షలు ఎక్కువ రిటర్నులు దాఖలయ్యాయన్నారు.