Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రుల గృహ నిర్బంధం
- డీలిమిటేషన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చిన గుప్కార్ కూటమి
శ్రీనగర్ : కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా వేడిని పుట్టిస్తున్నది. అసెంబ్లీ సీట్ల కేటాయింపు ప్రక్రియ సక్రమంగా జరగలేదన్న ఆగ్రహంతో డీలిమిటేషన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుప్కార్ కమిటీ ( దీనికి జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం వహిస్తున్నారు) ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ నిరసనలను నిరోధించడంలో భాగంగా అక్కడి యంత్రాంగం జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచింది. ఈ ముగ్గురూ ఉండే హై-సెక్యూరీటీ జోన్ అయిన శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డును మూసివేశారు. వారి ఇండ్ల బయట పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా బలగాల వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. అక్కడి నుంచి రాకపోకలను పోలీసు అధికారులు నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ లలో అసెంబ్లీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన ముసాయిదాను డీలిమిటేషన్ కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. అయితే, జమ్మూ, కాశ్మీర్ల మధ్య అసెంబ్లీ సీట్ల కేటాయింపు విషయంలో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూటమి అసంతృప్తిని వెలిబుచ్చింది. ఈ మేరకు నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలను అడ్డుకోవడంలో భాగంగా జమ్మూకాశ్మీర్ యంత్రాంగం ఆ ముగ్గురు మాజీ సీఎంల గృహ నిర్బంధానికి దిగింది. కాగా, పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని గురించిన ఫోటోను ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు నిసనలు నిర్వహించారు. తమ నాయకుల నిర్బంధం, డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.