Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహమ్మారిని ఓడించగలం : డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రెండేండ్లు పూర్తయింది. మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య అసమానతలను తొలగించి కలిసికట్టుగా పనిచేస్తే..2022లోనే ఈ మహమ్మారి అంతమవుతుందని అభిప్రాయపడ్డారు. ''మహమ్మారి నుంచి ఏ దేశమూ బయటపడలేదు. అయితే కోవిడ్ కట్టడికి, చికిత్సకు అనేక నూతన సాధనాలు ఉన్నాయి. సుదీర్ఘకాలంపాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే..మనం నియంత్రించలేనం తగా, కనీసం అంచనా వేయలేనంతగా వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అసమానతలకు ముగింపు పలికితేనే.. ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతాం. కోవిడ్-19 మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న క్రమంలో ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందని భావిస్తున్నా. కానీ, మనం కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యవుతుంది'' అని పేర్కొన్నారు. ''భవిష్యత్తులో ఎదురయ్యే అంటువ్యాధులు, మహమ్మారులను కట్టడి చేసేందుకు కొత్త బయోహబ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. బెర్లిన్‌లో పాండమిక్, ఎండమిక్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ప్రారంభించాం. ప్రజారోగ్యంపై కొత్త ఆవిష్కరణల కోసం ఇది ఉపయోగపడుతుంది'' అని వెల్లడించారు. 2022 మధ్యనాటికి ప్రపంచ జనాభాలో 70శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించే లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.