Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది వేలమందితో భారీ బహిరంగ సభ
న్యూఢిల్లీ : కార్పొరేట్ మతోన్మాద శక్తులపై రైతుల పోరాటం చారిత్రాత్మక విజయానికి గుర్తుగా తమిళనాడులోని తిరువారూర్లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రైతు విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. పది వేలమందితో కూడిన భారీ బహిరంగ సభ జరిగింది. ఎఐకేఎస్తో సహా అనేక రైతు సంఘాల నుంచి వేలాది మంది రైతులు, మరి ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు. సంప్రదాయ నృత్యాలు, పాటలతో భారీ ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల గుండా సాగి భారీ బహిరంగ సభతో ముగిసింది. దీనికి కెవి పొన్నయన్ అధ్యక్షత వహించగా, ఎఐకేఎస్ (శుక్లా లైన్) అధ్యక్షుడు అశోక్ ధావలే, ఎఐకేఎస్ (అజోరు భవన్) ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్, ఎఐకేఎస్ (శుక్లా లైన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి షణ్ముఖం, ఎఐకేఎస్ (అజరు భవన్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ గుణశేఖరన్ ప్రసంగించారు. అలాగే బహిరంగ సభలో ఎస్ తంబుసామి, విఎస్ కాళీయపెరుమాళ్, పిఎస్ మాసిలామణి, వి అమృతలింగం, వి సుబ్రమణియన్, మేరీ లిల్లీబాయి, చంద్రమోహన్, కలివప్పన్, బోస్, పిఎస్ కాళీరాజ్, కెబి ఎళంగిరన్, పసుమైవళవన్, పొన్నుతై తదితర నేతలు ప్రసంగించారు. ఏడాదికిపైగా ఢిల్లీ రైతు పోరాటానికి భారీ సంఘీభావ చర్యలకు నాయకత్వం వహించిన తమిళనాడు రైతులు, కార్మికులను వక్తలందరూ అభినందించారు. వారు కూడా వందలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి చాలా రోజులు ఉన్నారని గుర్తు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో సాధించిన విజయ ప్రాముఖ్యతను వివరిస్తూ కనీస మద్దతు ధర, ఇతర కీలకమైన రైతు డిమాండ్లకు చట్టపరమైన హామీ కోసం పోరాటం కొనసాగించాలని పిలుపు ఇచ్చారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం, దేశాన్ని విక్రయించడాన్ని వ్యతిరేకించాలని అన్నారు. మోడీ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలని పిలుపు ఇచ్చారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక, ఆర్థిక న్యాయం, రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా దాడి చేస్తున్నాయనీ, ఈ దాడులను ప్రతిఘటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. గత అన్నాడీఎంకే రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రైతుల పోరాటంలో సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపిన రైతు నాయకులను అశోక్ ధావలే, అతుల్ కుమార్ అంజాన్ సన్మానించారు.