Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ ఉక్కు ఉద్యమం దేశ వ్యాప్త విస్తరణ
- పరిరక్షణ పోరాట కమిటీ దీక్షలకు తపన్‌సేన్ సంఘీభావం
విశాఖ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఐక్య పోరాటా లతో ప్రతిఘటిస్తామని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ తెలిపారు. ఇప్పటి వరకు స్టీల్‌ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాడుతూ వస్తున్నారని, ఇకపై ఈ ఉద్యమానికి అన్ని ప్రభుత్వ రంగాల నుంచి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణను రూపొంది స్తున్నామని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 324వ రోజుకు చేరాయి. శనివారం సాయంత్రం ఈ దీక్షా శిబిరాన్ని తపన్ సేన్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మదమెక్కి దేశ సంపదను విచ్చలవిడిగా తెగనమ్ముతోందని విమర్శించారు. విశాఖ ఉక్కు .పరిరక్షణ ఉద్యమం నేడు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రప్రభుత్వం పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశ ఆర్థిక మూలాలను బలహీన పరుస్తున్న ఈ నిర్ణయాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దుర్గాపూర్, సేలం స్టీల్ప్లాంట్లను ప్రైవేటీకరించాలని చూస్తే, అక్కడి కార్మికులు టెండర్ వేసిన వారిని రైల్వే స్టేషన్ వరకు తరిమికొట్టారని, మరోసారి ప్రైవేటీకరణ కోసం వస్తే అదే రైల్వే ట్రాక్‌పైన పడుకోబెడతామని హెచ్చరించారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి వచ్చే వారికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించాలన్నారు. హిట్లర్, ముస్సోలినీ వంటి అనేకమంది నియంతలు ప్రపంచాన్ని భయపెట్టారని, కానీ అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తే ఐక్య పోరాటాలతో కాలగర్భంలో కలుపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటానికి సిద్ధమవుతోందని తెలిపారు. తాను టీ కార్మికుడుగానే జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. సెయిల్‌లో పదహారేళ్లు పనిచేశానని, సిహెచ్.నర్సింగరావు విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్మాణ సమయంలో మోటార్ సైకిల్‌పై నిర్మాణ పనులను పర్యవేక్షించే వారిని గుర్తు చేశారు. ఈ రకంగా ఉక్కు ఉద్యమంతో తనకు మొదటి నుంచి అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు సిహెచ్.నర్సింగరావు, జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, మస్తానప్ప, వైటి.దాస్, దొమ్మేటి అప్పారావు, మహాలక్ష్మినాయుడు, కామేశ్వరరావు, జిఆర్కె.నాయుడు, రామస్వామి, కర్మాగారం వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.