Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1400 దాటిన ఒమిక్రాన్ బాధితులు
- దేశంలో మళ్లీ కోవిడ్ భయాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కోవిడ్ భయాందోళనలు పెరిగాయి. కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 22వేలు దాటగా..400మందికిపైగా మరణించటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఒమిక్రాన్ కేసులు కూడా 1400 దాటాయి. 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాపిస్తోంది. శనివారంనాటికి ఈ కేసుల సంఖ్య 1431కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియెంట్ సోకగా..ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు, గుజరాత్, కేరళలోనూ కొత్త వేరియెంట్ కేసుల సంఖ్య 100 దాటడం కలవరపెడుతోంది. ఇప్పటివరకు మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మరోవైపు ఇప్పటివరకు 488 మంది కొత్త వేరియెంట్ నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.
యాక్టివ్ కేసులు లక్ష..
ఒమిక్రాన్ ప్రభావంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.10లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..22,775 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 2శాతం దాటడం గమనార్హం. ఇక ఇదే సమయంలో 8949 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.42కోట్ల మంది వైరస్‌ను జయించారు. ఇక నిన్న ఒక్క రోజే 406 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4.81లక్షల మందిని వైరస్ బలితీసుకుంది. మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ లక్ష మార్క్ దాటడం కలవరపెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,04,781 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.30 శాతానికి పెరిగింది.
టీనేజర్ల టీకాకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఇక దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. శుక్రవారం 58.11లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 1.45 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక జనవరి 3 నుంచి 15-18 ఏండ్ల వారికి కూడా టీకాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 15-18 ఏండ్లవారికి టీకా రిజిస్ట్రేషన్లు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వయసు వారికి టీకాల కోసం కోవిన్ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''పిల్లలు సురక్షితంగా ఉంటేనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయించండి'' అని మంత్రి కోరారు.