Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట
- 12 మంది మృతి.. 14 మందికి గాయాలు
- రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి సంతాపం
జమ్మూ : కొత్త సంవత్సరం వేళ జమ్మూకాశ్మీర్‌లో విషాదం చోటుచేసుకున్నది. ఇక్కడి రీసీ జిల్లాలో గల మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్ అదనపు డీజీపీ ముఖేశ్ సింగ్ వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా మాతా వైఫ్ణో దేవి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ఆలయంలో పూజల కోసం వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే, ఈ క్రమంలో కొందరు యువకుల మధ్య చెలరేగిన వివాదం ఈ తొక్కిసలాట ప్రమాదానికి దారి తీసినట్టు ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. కాగా, గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు అదనపు డీజీపీ చెప్పారు. ఈ తొక్కిసలాట శనివారం ఉదయం 2.45 గంటలకు గర్భగుడి వెలుపల జరిగిందని అధికారులు తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు, సంబంధిత అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. కాగా, మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్ లకు చెందినవారిగా గుర్తించారు. దాదాపు 5200 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయానికి ప్రతి ఏడాదీ భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు.
2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పీఎంఓ
ఈ ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) పరిహారం ప్రకటించింది. ప్రధాని ఈ ఘటనను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ప్రధాన మంత్రి కార్యాలయంలోని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ
తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. ఈ ఘటన గురించి ప్రధానికి వివరించానని చెప్పారు. అలాగే, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున ఆయన పరిహారం ప్రకటించారు. గాయపడినవారి చికిత్సకయ్యే ఖర్చును ఆలయ బోర్డు భరిస్తుందని ఆయన తెలిపారు. మాతా వైష్ణో దేవి ఆలయ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్లను ట్విట్టర్లో షేర్ చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు మనోజ్ సిన్హా వెల్లడించారు.
ఘటనానంతరం పోలీసులు, అధికారులు తక్షణమే స్పందించారనీ, అయితే ఇంతలోనే ఈ నష్టం జరిగిందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించగా వారిలో కొందరి పరిస్థితి 'విషమంగా' ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు.