Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత కార్మిక నేతలు తపన్‌సేన్, హేమలత, చంద్రన్ పిళ్ళై, లలిత్మిశ్రా, దేవ్‌రారు రాక
- స్టీల్‌ప్లాంట్ ప్రాంతాల్లో
- సమావేశాలు, పర్యటనలు
గ్రేటర్ విశాఖ : ఆలిండియా పబ్లిక్ సెక్టార్ ఎక్స్టెండెడ్ కో-ఆర్డినేషన్ కమిటీ (పిఎస్యుఇసిసి) కన్వెన్షన్స్, సమావేశాలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశాలు ఆదివారం నుంచి మంగళవారం వరకు కొనసాగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి 15 మంది కార్మికోద్యమ ముఖ్య నేతలు, 150 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. స్టీల్, కోల్, మైన్స్, పోర్టులు, పవర్ సెక్టార్ (విద్యుత్ రంగం), ఆయిల్ సెక్టార్ తదితర రంగాలకు చెందిన 15 మంది నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కేంద్ర విధానంపై పోరు
కేంద్రం అనుసరిస్తోన్న విధానాలపై వివిధ రంగాల్లో నిపుణులైన ఆలిండియా కార్మికోద్యమ నేతలు విశాఖ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ కార్యక్రమం దోహదం కానుంది. ఈ సందర్భంగా విశాఖ, గాజువాక, స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్ పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ, సిఐటియు సమన్వయం చేస్తుంది. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిఐటియు జాతీయ నాయకులు తపన్సేన, హేమలత శనివారమే నగరానికి విచ్చేశారు. ఆదివారం 15 మంది జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు, రామచంద్రన్ పిళ్ళై, లలిత్ మిశ్రా, బాలగోపాల్, రామనాథన్, దేవ్‌రారు, నరేన్ఛోటియా, నరేంద్రరావు, వెంకటేష్, సాయిబాబా, సిహెచ్.నరసింగరావు, నందు చౌదరి పాల్గొననున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు స్టీల్‌ప్లాంట్ ఆంధ్రకేసరి ఆడిటోరియంలో కన్వెన్షన్, సాయంత్రం 5 గంటలకు స్టీల్ ప్లాంట్‌లో సిఐటియు కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం ఉంటుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఇఎస్ఐ జాతీయ బోర్డు సభ్యులు ప్రశాంతి నందిచౌదరి ఇఎస్ఐ అధికారులతో కలిసి షీలానగర్ ఆసుపత్రిలో పర్యటించనున్నారు. అనంతరం ఇఎస్ఐ గాంధీగ్రాం ఆసుపత్రిని పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో జరిగే బహిరంగ సభకు షిప్‌యార్డు, భెల్, మల్కాపురం, గాజువాక నుంచి కార్మికులు హాజరుకానున్నారు.
5.30 గంటలకు విశాఖ నగరంలోని ఎల్ఐసి వద్ద బహిరంగ సభ జరుగుతుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు విశాఖలోని పౌరగ్రంథాలయంలో ప్రభుత్వ రంగ సంస్థల రక్షణపై సెమినార్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఎన్ఎడి, ఎన్ఎస్టిఎల్ వద్ద కార్మిక సభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఆలిండియా సిఐటియు, పబ్లిక్ సెక్టార్ ఎక్సెటెండెడ్ కోఆర్డినేసన్ కమిటీ నాయకులు, పలువురు ప్రసంగించనున్నారు.