Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం-కిసాన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పిలుపు
- కోవిడ్‌పై పోరులో 2021 చిరస్మరణీయం
న్యూఢిల్లీ : నూతన సంవత్సరంలో అభివృద్ధి క్రమాన్ని వేగిరపరచాల్సిన అవసరం వుందంటూ ప్రధాని నరేంద్రమోడీ శనివారం పిలుపిచ్చారు. కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన సవాళ్లు అభివృద్ధి క్రమానికి ఆటంకం కలిగించడానికి అనుమతించరాదని అన్నారు. పూర్తి అప్రమత్తత, నిరంతర నిఘాతో ఈ మహమ్మారిపై పోరును కొనసాగిస్తామని చెప్పారు. అదే సమయంలో దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యమేనని అన్నారు. పీఎం-కిసాన్ పథకం కింద 10వ వాయిదాను విడుదల చేసే కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. కరోనాతో ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, స్టార్టప్ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఇలా అన్ని రంగాలు దెబ్బతిన్నా, దేశం సాధించిన విజయాలను మోడీ వివరించారు. కోవిడ్‌పై భారత్ సాగించిన పోరాటానికి, చేపట్టిన సంస్కరణలకు గానూ 2021 సంవత్సరం ఎప్పటికీ బాగా గుర్తుండిపోతుందని అన్నారు. వివిధ రంగాల్లో సంస్కరణలను వేగిరపరిచామని మోడీ చెప్పుకున్నారు. అధునాతన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ అభివృద్ధి క్రమాన్నిఇంకా వేగిరపరచాల్సి వుందన్నారు. కరోనా మనకు సవాళ్లు విసురుతోంది, కానీ అభివృద్ధి క్రమాన్ని స్తంభింపచేయలేదని మోడీ వ్యాఖ్యానించారు. మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి నందున, గత విజయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం కొత్త ప్రయాణాన్ని ఆరంభించాల్సిన అవసరం వుందని అన్నారు. కరోనా మహమ్మారితో పోరు, వ్యాక్సినేషన్ డ్రైవ్, క్లిష్టసమయాల్లో బాధిత వర్గాలకు అవసరమైన సాయం వంటి రంగాల్లో దేశం చేపట్టిన చర్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశంలో మెడికల్ మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోందన్నారు. మన స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున మనం మరింత కృతనిశ్చయంతో, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని మోడీ ఆకాంక్షించారు. సమిష్టి కృషికి గల శక్తి ఆయన వివరించారు.