Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్స్‌ఫామ్, మదర్ థెరిస్సా చారిట్, జామియా, ఐఎంఏతో పాటు పలు సంస్థలు
- జాబితాలో 12 వేలకు పైగా ఎన్జీవోలు
- కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : దాదాపు 12 వేలకు పైగా ఎన్జీవోలకు సంబంధించి విదేశాల నుంచి విరాళాలు పొందడానికి అవసరమయ్యే ఎఫ్సీఆర్ఏ లైసెన్సును కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. అయితే, ఒక్క శనివారమే దాదాపు ఆరు వేల ఎన్జీఓలు, సంస్థలు లైసెన్సులు కోల్పోవడం గమనార్హం. వీటిలో కొన్ని సంస్థల ఎఫ్సీఆర్ఏ లైసెన్సు ముగిసిపోగా.. మరికొన్ని రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తిరస్కరణకు గురయ్యాయని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మదర్ థెరిస్సా మిషనరీ ఆఫ్ చారిటీ లైసెన్సును పునరుద్ధరించడానికి నిరాకరించిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. ఎఫ్సీఆర్ఏ కింద 12,580 ఎన్జీవోల రిజిస్ట్రేషన్ శనివారం నాటికి నిలిచిపోవడం లేదా గడువు ముగిసిపోవడం జరిగింది. కాగా, ఒక్క శనివారమే 5933 ఎన్జీఓలు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయని హౌంశాఖ వర్గాలు తెలిపాయి. శుక్రవారం గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవాలని రిమైండర్లు పంపామనీ, అయినప్పటికీ సంస్థలు ముందుకు రాలేదనీ, ఇప్పుడు అనుమతి ఎలా లభిస్తుందని హౌంశాఖ అధికారులు ప్రశ్నించారు. కాగా, 179 ఇతర దరఖాస్తుల్లో మదర్ థెరిస్సా చారిటీ సహా మిగతావీ తిరస్కరణకు గురయ్యాయనీ, మరికొన్ని స్క్రుటినీలో ఉన్నట్టు హౌం శాఖ తెలిపింది. ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ లైసెన్సు కోల్పోయిన సంస్థల జాబితాలో ఆక్స్‌ఫామ్ ఇండియా అండ్ ఆక్స్‌ఫామ్ ఇండియా ట్రస్ట్, జామియా మిలియా ఇస్లామియా, ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ది లెప్రసీ మిషన్, ది ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ది ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ది ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఆక్స్‌ఫామ్ ఇండియా, ఆక్స్‌ఫామ్ ఇండియా ట్రస్ట్‌లు సర్టిఫికెట్ల గడువు ముగిసన ఎన్జీఓల జాబితాలో ఉన్నాయి కానీ, రిజిస్ట్రేషన్లు రద్దయిన సంస్థల జాబితాలో లేవు. ఏదైనా ఎన్జీఓ లేదా సంస్థ విదేశాల నుంచి నిధులు పొందాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద లైసెన్సును తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, దేశంలో శనివారం నాటికి 22,762 ఎఫ్సీఆర్ఏ నమోదిత ఎన్జీవోలు ఉండగా, నేడు ఆ సంఖ్య 16,829కి తగ్గినట్టు హౌం శాఖ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నది.