Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే అఖిలపక్ష సమావేశం జరసాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) విజ్ఞప్తి
అమరావతి : కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం వేసి, ఢిల్లీకి అన్ని పార్టీల ప్రతినిధి వర్గాన్ని తీసుకెళ్ళాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, కానీ బిజెపి కేంద్ర ప్రభుత్వం అందుకవసరమైన నిధులను, అనుమతులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. ఒకవైపు డ్యామ్ పనులు జరుగుతుండగా మరోవైపు భారీ వరదలు వచ్చి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలు మునిగిపోతున్నాయని, కానీ ఇంత వరకు నిర్వాసితులకు పరిహారం గానీ, పునరావాసం కానీ కల్పించలేదని తెలిపారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నా, పార్లమెంటు సందర్భంగా ఢిల్లీలో ధర్నా సైతం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుండి చలనం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు నిర్వాసిత కుటుంబాల లెక్కలు పంపాలని కోరడం గర్హనీయమని తెలిపారు. నిర్వాసితుల పునరావాసం, అన్ని రకాల ప్రాజెక్టు అనుమతులను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, మారుతున్న అంచనాలకనుగుణంగా నిధులు అందించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని పేర్కొన్నారు. ఆ బాధ్యత మరచి రక రకాల సాకులతో కొర్రీలు వేస్తూ ప్రాజెక్టు నిర్మాణం జాగు చేస్తోందని తెలిపారు. మునక ప్రాంతాల్లో అభివద్ధి ఆగిపోయి నిర్వాసితులు త్రిశంకుస్వర్గంలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం కోసం రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసికట్టుగా పోరాడాలని కోరారు.