Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనాజీ : గోవా.. దేశంలోనే అత్యంత చిన్న రాష్ట్రం. స్వదేశీల నుండి విదేశీ పర్యాటకుల వరకు పార్టీ ఏదైనా, పంక్షన్ ఏదైనా మొట్టమొదటిగా గుర్తుకొచ్చే ప్రాంతం కూడా ఇదే. విశాలమైన సముద్ర తీరం, వారసత్వ కట్టడాలు గోవాకు ఆభరణాలు. అటువంటి రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు మునుపెన్నడూ లేనివిధంగా రసవత్తంగా మారాయి. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ.. ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ పట్టం కట్టాలో అర్థం కాక.. సందేహంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం అక్కడ బిజెపి అధికారంలో ఉండగా... కాంగ్రెస్, ఆప్‌లతో పాటు తొలిసారి పొటీకి దిగుతున్న తణమూల్ గోవా పీఠాన్ని దక్కించుకునేందుకు యత్నాలు మొదలు పెట్టాయి. ఇక స్థానిక పార్టీలూ సైతం తామేమీ తీసుపోలేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే గోవా అసెంబ్లీలో ఎవరూ గెలిస్తే.. తదుపరి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారే గెలుస్తారన్న ఓ చిన్న సెంటిమెంట్ రాజకీయ వర్గాల్లో ఉంది. అది నిజమో కాదో.. సార్వత్రిక ఎన్నికలు వరకు ఎదురు చూడాల్సిందే.
మూడు నెలల్లో.. తొమ్మిది మంది జంప్‌జిలానీలు
40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో.. గత మూడు నెలల్లో.. అక్కడ 9 మంది ఎమ్మెల్యేలు పలు పార్టీలు మారారు. ఇందులో ముగ్గురు బిజెపిలోకి, ఇద్దరు తణమూల్ కాంగ్రెస్, ఒక్కొక్కరు చొప్పున ఆప్, కాంగ్రెస్‌లోకి చేరారు. మరో స్వతంత్య్ర అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం వివిధ పార్టీల్లోకి జంప్ అయ్యారు. వీరితో పాటు లైంగిక ఆరోపణలపై సీనియర్ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే మిలింద్ నాయక్ రాజీనామా చేయక తప్పలేదు. అయితే రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలపై ప్రజలు సైతం ఎవరికీ పట్టం కడతారో అన్న సందిగ్ధం రాజకీయ విశ్లేషకుల్లోనూ నెలకొంది.
బీజేపీపై అధికార వ్యతిరేకత
గోవాలోని అధికార బిజెపి ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిరుద్యోగం పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, గత పదేళ్లలో అవినీతి గుట్టలుగా పేరుకుపోవడంతో అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో నెలకొంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పనితీరు పట్ల కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై ఓ సామాన్యున్ని అడగ్గా.. ఎవరు గెలుస్తారో భగవంతుడికే తెలియాలి అన్న ఆయన... బిజెపి మాత్రం గెలువదని విశ్వాసంతో చెప్పారు.
2017 నాటి నుండి ఇప్పటి వరకు..
2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెటలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. హంగ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన బిజెపి.. గోవా పార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి), మమహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ (ఎంజిపి)లతో పొత్తుపెట్టుకుని పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆప్ ఒక్క స్థానాన్ని కూడా గెలుపొందలేదు. ఈ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు గోవా మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత దివంగత మనోహర్ పారికర్ ప్రధాన పాత్ర పోషించారు. 2019లో పారికర్ మరణాంతరం.. కూటమికి బీటలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా బిజెపిని వీడటం ప్రారంభించారు. 12 మంది సభ్యులున్న కేబినేట్లో ఏడుగురు ఇతర పార్టీలకు పిరాయించడం గమనార్హం. దాదాపు గోవా రాజకీయాల్లో 27 ఏండ్లుగా ప్రధాన పాత్ర పోషించిన పారికర్ లేకుండా.. తొలిసారి బిజెపి ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మితిమీరిన నియంత్రణ పోకడ నేపథ్యంలో ఫ్యాక్షనిజం తీవ్ర రూపం దాల్చడంతో.. గోవాలో పాగా వేసేందుకు కమల దళానికి కష్టంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఆప్.. పక్కా ప్రణాళికతో ముందుకు
గత ఎన్నికల్లో ఆప్ కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇప్పుడు పీఠాన్ని దక్కించుకునేందుకు మరిన్ని వనరులతో.. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అయితే ఈ ఐదేళ్లలో పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడ్ని తయారు చేయడంలో విఫలమైంది. ఆప్‌కు గోవా వ్యాప్తంగా పేరుగాంచిన నేత ఒక్కరూ లేకపోవడం కలిసిరాని అంశం. రాష్ట్ర కన్వీనర్ రాహుల్ మాంబ్రే కూడా తన స్వస్థలం మపుసాకు వరకే ప్రజాదరణ పొందారు. కొత్తగా చేరిన అమిత్ పాలేకర్ రాజకీయ నేతగా కంటే.. న్యాయవాదిగా మాత్రమే సుపరిచితులు. ఇక ఆప్‌ను గట్టెక్కించేవీ ఏంటంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మేనియా, ఇతర పార్టీల నుండి ప్రముఖలను చేర్చుకోవడం.. ప్రజలకు చేరువయ్యే విధంగా తాయితాలను ప్రకటించడం. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతల్ని ఆప్‌లోకి స్వాగతించింది. అదేవిధంగా పలు వాగ్దానాలు చేసినప్పటికీ.. అవి ప్రజలకు చేరువయ్యే విధంగా లేదని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ గోవా రాజకీయాల్లో దాని కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. కాగా, ఆప్ పట్ల అక్కడి ప్రజలకు మంచి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు.
తృణమూల్ ప్రయత్నం
దేశ రాజకీయాలను శాసించేందుకు సిద్ధమైన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్.. అందులో భాగంగా గోవాపై కన్ను వేసింది. గోవా వాసులు కూడా మమతా ప్రాభవంతో ఈ పార్టీ పట్ల ఆసక్తి కరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. టిఎంసి కూడా వేగంగా ప్రచారాలను మొదలుపెట్టింది. ఇక పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య కూడా మొదలైంది. ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే అలెక్సో రెగినాల్డో మొదలైన పరంపర.. కొనసాగుతూనే ఉంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో రాజకీయ ప్రణాళికలను టిఎంసి తూచా తప్పకుండా పాటిస్తుంది. ఇందులో భాగంగానే గోవాలో అత్యంత వృద్ధ పార్టీగా ఉన్న ఎంజిపితో చేతులు కలిపింది. ఈ పొత్తు నచ్చని ఇద్దరు ఎంజిపి నేతలు ఈ కూటమి నుండి బయటకు వచ్చేశారు. వీరిలో ఒకరూ బిజెపిలో చేరగా.. మరొకరు కూడా ఆ దోవలోనే ఉన్నట్లు సమాచారం. అయితే టిఎంసి, ఆప్‌లు.. బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశాలున్నట్లు తెలుస్తూనే ఉంది.
కాంగ్రెస్ ప్రభావం తగ్గిందా..?
ఇతర రాష్ట్రాల మాదిరిగానే.. గోవాలో కూడా కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండంగా మారింది. గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా ఎదిగిన కాంగ్రెస్.. కూటమి ఏర్పాటు చేసుకుని.. పీఠాన్ని దక్చించుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీకి మిగిలారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖాలతో లేదా ప్రజాదరణ పొందిన నేతలను ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన పరిస్థితి. కాగా, ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ .. అధికార బిజెపి చేసిన అక్రమాలను ఎండగట్టడంతో పూర్తిగా విఫలమైంది. 2019లో బిజెపి మంత్రి దీపక్ పౌస్కర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను డబ్బుల కోసం అమ్ముకున్నాడని సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు వెలువగా.. దీన్ని పదునుగా కాంగ్రెస్ వినియోగించుకోలేకపోయింది. లైంగిక ఆరోపణలు చేసిన మిలింద్నాయక్ విషయంలో కూడా తడబడింది. ఇక ఈ ఎన్నికల్లో ఓట్లను ఎలా రాబట్టుకుందో అధిష్టానం చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందో అన్న సందిగ్ధం నెలకొంది. ప్రజల్లోనూ ఏ పార్టీకి ఓటేయ్యాలో అన్న ఆందోళన నెలకొంది.