Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో 7.91 శాతం
- పట్టణాల్లో 9.30 శాతం.. గ్రామాల్లో 7.28 శాతం
- జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో తక్కువ
- తెలంగాణలో 2.2 శాతం.. ఏపీలో 5.6 శాతం : సీఎంఐఈ
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ రేటు పెరిగింది. 2021 సెప్టెంబర్ నుంచి ప్రతి నెల నిరుద్యోగ రేటు పెరుగుతూ నమోదవుతున్నది.అందులో పట్టణ నిరుద్యోగం మరింత ఎక్కువగా నమోదవుతున్నది.2021 డిసెంబర్లో దేశంలో 7.91 శాతం నిరుద్యోగం రేటు రికార్డయ్యింది.అందులో పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.28శాతంగా ఉన్నది. ఈ విషయాన్ని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ)' వెల్లడించింది. 2021 సెప్టెంబర్‌లో దేశంలో 6.86శాతం నిరుద్యోగం రేటు నమోదైంది. ఇందులో పట్టణ నిరుద్యోగ రేటు 8.62శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు 6.06 శాతంగా ఉన్నది.అలాగే 2021అక్టోబర్ నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 7.75 శాతానికి పెరిగింది. అందులో పట్టణ నిరుద్యోగ రేటు 7.38 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు7.91శాతానికి ఎగబాకింది. 2021 నవంబర్‌లో దేశంలో 7 శాతం నిరుద్యోగం రేటు నమోదు కాగా, అందులో పట్టణ నిరుద్యోగ రేటు 8.21 శాతం, గ్రామీణ నిరుద్యోగ రేటు6.44 శాతంగా రికార్డయ్యింది. డిసెంబర్లో 7.91శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా,అందులో 9.30శాతం పట్టణ,7.28శాతం గ్రామీ ణ నిరుద్యోగ రేటు ఉన్నది. ఇలా ప్రతి నెలా నిరుద్యోగ రేటు పెరుగుతూనే ఉన్నది.
నిరుద్యోగంలో హర్యానా టాప్
బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానా నిరుద్యోగంలో అగ్రభాగాన నిలిచింది. అక్కడ జాతీయ సగటుకు నాలుగైదు రెట్లు ఎక్కువ నిరుద్యోగ రేటు నమోదు అయింది. హర్యానాలో నిరుద్యోగ రేటు 34 శాతం నమోదు అయింది. జాతీయ సగటు కంటే ఎక్కువ నిరుద్యోగ రేటు నమోదు అయిన రాష్ట్రాల్లో రాజస్థాన్ (27.1 శాతం), జార్ఖండ్ (17.3 శాతం), బీహార్ (16 శాతం), జమ్మూ కాశ్మీర్ (15 శాతం), గోవా (12 శాతం), త్రిపుర (14.7 శాతం), ఢిల్లీ (9.8 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (9.4 శాతం) ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదు అయింది. తెలంగాణలో నిరుద్యోగ రేటు 2.2 శాతంగా ఉన్నది. ఏపీలో 5.6 శాతం నిరుద్యోగ రేటు ఉన్నది. తెలంగాణలో నవంబర్ (4.4 శాతం) కంటే డిసెంబర్ (2.2 శాతం)లో నిరుద్యోగ రేటు తక్కువ నమోదైంది. ఏపీలోనూ నవంబర్ (6.3 శాతం) కంటే డిసెంబర్ (5.6 శాతం)లో నిరుద్యోగ రేటు తక్కువగా రిజిస్టరైంది.