Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దుపై ఆక్స్‌ఫాం ఇండియా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మానవతాసాయం, సామాజిక కార్యక్రమాలు చేపట్టామని, ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దుతో ఆ కార్యక్రమాలన్నీ నిలిచిపోతాయని ఎన్జీఓ సంస్థ 'ఆక్స్‌ఫాం ఇండియా' ఆందోళన వ్యక్తం చేసింది. ''విదేశీ విరాళాల స్వీకరణకు అనుమతించే లైసెన్స్‌ను ఆక్స్‌ఫాం ఇండియాకు ఇవ్వడాన్ని కేంద్రం తిరస్కరించింది. ఎన్జీఓ సంస్థగా ఆక్స్‌ఫాం ఇండియా నిర్వహిస్తున్న మానవతా సహాయ కార్యక్రమాలు, సామాజిక సేవపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపుతుంది.
ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటు, అత్యంత కీలకమైన ఔషధాలు, వైద్య పరికరాల సేకరణ, ఆక్సీజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సమకూర్చడం..వంటివి కోవిడ్ సంక్షోభ సమయంలో సంస్థ చేపట్టింది. లైసెన్స్ రద్దుతో ఇదంతా ఆగిపోతుంది'' అని ఆక్స్‌ఫాం ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 6వేల ఎన్జీవో సంస్థల విదేశీ విరాళాల లైసె న్స్ల్ని శనివారం కేంద్రం రద్దు చేసింది. ఎన్జీవోలపై మోడీ సర్కార్ ఉక్కుపాదంతో అణచి వేతకు పాల్పడుతోందని విమర్శలు వెలువడ్డాయి. విద్య, వైద్యం, పౌర హక్కులు, సామా జిక రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపటం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈఅంశంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. తాజాగా ఎఫ్సీఆర్ఏ లైసెన్సులు కోల్పోయిన వాటిలో కొన్ని సంస్థలు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోలేదని, మరికొన్నింటి దరఖాస్తులను కేంద్ర హోంశాఖ తిరస్కరించిందని అధికారులు వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆక్స్‌ఫాం ఇండియా..మొదలైనవి లైసెన్స్ రద్దు అయినవాటిలో ఉన్నాయి. ఏ ఎన్జీవో అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తుల, సంస్థల నుంచి విరాళాలు స్వీకరించాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద లైసెన్స్ తీసుకోవాలి. ప్రస్తుత లైసెన్స్ గడువు గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసింది.
ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం : అమితాబ్ బెహర్, సీఈవో, ఆక్స్‌ఫాం ఇండియా
ప్రజా ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వంతో 'ఆక్స్‌ఫాం ఇండియా' కలిసి పనిచేస్తోంది. కొన్ని సామాజికవర్గాలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాం. కోవిడ్-19 సంక్షోభ సమయాన ఆక్స్‌ఫాం ఇండియా పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వ ఆరోగ్య విభాగాలతో కలిసి పనిచేసింది. జిల్లా వైద్య అధికారులకు, ఆశా వర్కర్లకు మద్దతుగా నిలబడింది. కోవిడ్ సమయంలో విద్యారంగంలో సేవలు నిలిచిపోగా, ఆ అంతరాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాం. మహిళల జీవనోపాధిని మెరుగుపర్చడం కోసం పనిచేశాం. ఆక్స్‌ఫాం ఇండియాకు లైసెన్స్ రద్దు చేయటంతో సేవా కార్యక్రమాలు, మానవతా సాయం అంతా దెబ్బతినే ప్రమాదముంది.