Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధారాలు లభిస్తే తగిన చర్యలు : డీఐజీ గర్హ్వాల్
డెహ్రాడూన్ : ఇటీవల హరిద్వార్‌లోని ధర్మ సంసద్ కార్యక్రమంలో హిందూత్వ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం దీనిపై దర్యాప్తును జరుపుతుందని గర్హ్వాల్ డీఐజీ కే.ఎస్. నగ్న్యాల్ తెలిపారు. గతనెలలో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు హిందూత్వ నాయకులు ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన విషయం విదితమే. '' ఈ విషయంలో సిట్‌ను ఏర్పాటు చేశాం. ఇది దర్యాప్తును జరుపుతుంది. ఈ విషయంలో వారికి ( ద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూత్వ నాయకులు) వ్యతిరేకంగా తగిన బలమైన ఆధారం లభిస్తే చర్యలు తీసుకుంటాం'' అని డీఐజీ చెప్పారు. కాగా, ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే ఐదుగురు హిందూత్వ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటూ ధర్మ సంసద్ కార్యక్రమంలో హిందూత్వ నాయకులు చేసిన ప్రసంగాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయంలో ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో పుష్కర్‌సింగ్ ధమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. నిందితులపై చర్యలు తీసు కోవాలని వారి ప్రసంగాలకు వ్యతిరేకంగా హరిద్వార్‌తో పాటు డెహ్రాడూన్‌లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.