Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 మంది సభ్యులతో పార్లమెంటరీ కమిటీ
- బిల్లుపై మహిళా ఎంపీలతో విస్తృత చర్చ జరగాలి : ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే
న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సు 18 ఏండ్ల నుంచి 21ఏండ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, రాజకీయేతర వర్గాలు మోడీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. వివాహ వయస్సు పెంపు నిమిత్తం సిద్ధం చేసిన ముసాయిదా చట్టంలోని అంశాల్ని సమీక్షించ డానికి కేంద్రం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసింది. అయితే ఈ కమిటీ 31 ఎంపీలతో ఏర్పాటుకాగా, ఇందులో ఒకే ఒక మహిళా ఎంపీకి చోటు కల్పించటం విమర్శలకు దారితీసింది. ముసాయిదా చట్టాన్ని సమీక్షించే కమిటీలో మహిళా ఎంపీలకు పెద్దగా స్థానం కల్పించకపోవ టం వార్తల్లో నిలిచింది. మహిళల వివాహ వయస్సు 21 ఏండ్లకు పెంచుతూ 'ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్(సవరణ)' పేరుతో ముసాయిదా చట్టాన్ని కేంద్రం సిద్ధం చేసింది. ఈ చట్టం ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వర్తిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వివాహ చట్టాల్ని, వ్యక్తిగత చట్టాల్ని రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్, డైవోర్స్ యాక్ట్, ద ముస్లిం పర్సనల్ లా(షరియత్), ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద ఫారెన్ మ్యారేజ్ యాక్ట్...తదితర చట్టాల్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును కేంద్రం రూపొందించింది. బీజేపీ ఎంపీ వినరు సహస్రబుద్దే నేతృత్వంలో 31మంది ఎంపీలతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కేంద్రం ఏర్పాటుచేసింది. ఇందులో ఒకే ఒక మహిళా ఎంపీ టీఎంసీకి చెందిన సుష్మితాదేవ్ సభ్యురాలిగా ఉన్నారు. అన్ని వర్గాల వారి ప్రయోజనాల్ని కమిటీ పరిగణలోకి తీసుకుంటుందని, మరికొంత మంది మహిళా ఎంపీలకు కమిటీలో చోటు కల్పిస్తే బాగుండేదని ఎంపీ సుష్మితా దేవ్ అన్నారు. కమిటీలో మహిళా ఎంపీ ఒక్కరికే చోటు ఇవ్వటాన్ని ఎన్సీపీ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తప్పుబట్టారు. ముసాయిదా చట్టంపై సమగ్రమైన చర్చ జరగాలని, ఇందులో కమిటీ చైర్మెన్దే ముఖ్య బాధ్యత ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. విస్త్రతస్థాయి చర్చ కోసం మహిళా ఎంపీలను కమిటీ చైర్మెన్ ఆహ్వానం పలకాలని సూచించారు.